Amaravati: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. పుర పోరులో కూటమి సాధించిన విజయం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అమరావతి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు.
మున్సిపల్ ఎన్నికల ఘన విజయంతో కూటమి ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే క్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇదే జోరు కొనసాగించాలన్నారు సీఎం చంద్రబాబు. బుధవారం మధ్యాహ్నం కూటమి పార్టీలోని ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ లతో కీలక నేతలు, మూడు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి నిర్ధేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికల మాదిరిగా పరిషత్ ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. ఎలాంటి చిన్న చిన్న తప్పిదాలకు అవకాశం ఇవ్వవద్దన్నారు. పుర పోరులో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడంపై నేతలను, కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ గెలుపు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని, ప్రజలకు మనం అండగా నిలిస్తే వారు మనతో ఉంటారన్నారు. అందుకు ఈ ఫలితాలు నిరూపించాయని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. కొన్నిచోట్ల ఓటమి పాలైనా అక్కడ కూటమి రెబెల్ అభ్యర్థులు గెలిచారని వివరించారు.
స్థానిక సమన్వయం లేకపోవడంతో కొన్ని స్థానాలు కోల్పోయామన్నారు. కూటమి ఐక్యతను గుర్తు చేస్తూ.. మిత్రపక్షాలను గౌరవించుకోవాలన్నారు. కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థి అయినా మన అభ్యర్థిగా భావించాలన్నారు. కుటుంబం మాదిరిగా పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమని, నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉండాలన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించని వారిని వదులుకోవడానికి సిద్ధమని గట్టిగా హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కనివారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని మళ్లీ గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఉచ్చులో పడకుండా కార్యకర్తలు సంయమనం పాటించాలని శ్రేణులకు సూచించారు సీఎం చంద్రబాబు.
ALSO READ: గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!