Tejesh Vaish Success Story: కృషి, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని లక్నోకు చెందిన ఓ యువ ఇంజనీర్ మరోమారు చాటి చెప్పారు. చిన్నప్పుడు దుకాణంలో సమోసాలు, స్వీట్లు అమ్మిన స్థాయి నుంచి నేడు దుబాయి కేంద్రంగా నడిచే ఏఐ కంపెనీలో ప్రముఖ ఇంజనీర్ గా పనిచేసే స్థాయికి ఎదిగారు. రూ. 2.5 కోట్ల భారీ ప్యాకేజీని అందుకుంటున్నారు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అయిన తేజేష్ వైష్ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.
యూపీ లక్నో కంటోన్మెంట్‌లోని సదర్ బజార్‌కు చెందిన తేజేష్ తండ్రి అశోక్ కుమార్ వైష్ అక్కడ ‘గాయత్రి మిష్ఠాన్ భండార్’ పేరిట చిన్న స్వీట్ షాప్ నడుపుతున్నారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న రోజుల్లో తేజేష్ ప్రతిరోజూ తన తండ్రికి షాప్‌లో సమోసాలు, జిలేబీలు చేయడం నుంచి స్వీట్ల అమ్మకాల వరకు అన్నింట్లో సాయపడేవారు. అయితే తేజేష్ చిన్నప్పుడు చదువులో వెనుకబడి ఉండేవాడట. లక్నోలోని సెయింట్ పాల్స్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆయనకు కేవలం 48 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి.
ప్రారంభంలో చదువులో వెనుకబడినప్పటికీ తేజేష్ పట్టు విడువలేదు. నిరంతరం శ్రమించడంతో 10వ తరగతి నాటికి 94 శాతం, 12వ తరగతిలో 95 శాతం మార్కులు సాధించి గణనీయమైన పురోగతిని చూపించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవడానికి తేజేష్ ఒక ఏడాది విరామం తీసుకున్నారు. రోజుకు 6 గంటల పాటు కోచింగ్ తరగతులకు హాజరవుతూ మరో 12 గంటలు సొంతంగా చదువుకునేవారు. అలా 2019 యూపీఎస్‌ఈఈ (UPSEE) పరీక్షలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకుతో పాటు లక్నో టాపర్‌గా నిలిచారు. ‘ఐఐటీ కాన్పూర్’లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు. అక్కడ విశేష ప్రతిభ కనబరిచి 2023లో 9.14 సీపీఐ (CPI) స్కోర్‌తో పట్టా పొందడమే కాకుండా ‘అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు’ను కూడా అందుకున్నారు.
ఐఐటీ కాన్పూర్‌లో చదువుతున్న సమయంలోనే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, సెక్యురోనిక్స్ కంపెనీలలో తేజేష్ ఇంటర్న్‌షిప్‌లు చేశారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలో రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలో పాల్గొన్నారు. అంతేకాకుండా దాదాపు 3,000 మందికి పైగా విద్యార్థులకు మెంటార్‌షిప్ కూడా అందించారు. ప్రస్తుతం దుబాయ్‌లోని ‘లుమియన్ ఏఐ’ (Lumian.ai) కంపెనీలో లీడ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజేష్.. అమెజాన్ బ్రాండ్‌ల కోసం ప్రొడక్షన్ ఏఐ ఏజెంట్లను డెవలప్ చేస్తున్నారు.
Also Read: Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!
అయితే తనలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో స్థిరపడటానికి ఐఐటీ డిగ్రీ మాత్రమే ఏకైక మార్గం కాదని తేజేష్ చెబుతున్నారు. పైథాన్, ఎస్‌క్యూఎల్, డేటా స్ట్రక్చర్స్, ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా వంటి అంశాల్లో పట్టు సాధించాలని సూచిస్తున్నారు. వాటిపై ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా అనుభవాన్ని పెంచుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రారంభంలో వచ్చే ఫలితాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. తద్వారా ఏఐ రంగంలో అత్యున్నత స్థాయికి ఏదిగేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!