CM Chandrababu: ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు జలహారతి కార్యక్రమం తర్వాత శ్రీశైలం డామ్ గేట్ల ఓపెన్ చేయనున్నారు ముఖ్యమంత్రి. దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరగుతున్నాయి.
శ్రీశైలం జలాశయం గేట్లు ఆగస్టు చివరవారం లేకుంటే సెప్టెంబరు మొదటి వారంలో ఓపెన్ చేస్తుంటారు. ముందుగా జూన్ తొలివారం నుంచి వర్షాలు పడుతుండడంతో వరద ప్రవాహం భారీగా చేరుతోంది. జూన్ నుంచి జులై మొదటివారానికి శ్రీశైలం జలాశయంలోకి 125 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గడిచిన 15 ఏళ్ల సగటున లెక్కిస్తే 12.26 టీఎంసీలే.
ఎప్పుడూ లేనంతగా జులై తొలి వారంలో శ్రీశైలం గేట్లు ఓపెన్ చేస్తున్నారు. ఈక్రమంలో సీఎం చంద్రబాబు మంగళవారం శ్రీశైలం వెళ్తున్నారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 11 గంటలకు భ్రమరాంబ-మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు ముఖ్యమంత్రి.
ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం డామ్ గేట్లు ఓపెన్ చేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సున్నిపెంటలో నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత అమరావతి చేరుకుంటారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 1,71,550 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 880.80 అడుగుల వరకు నీరు చేరుకుంది. జలాశయ సామర్థ్యం 215 టీఎంసీలు, ఇప్పటికే 192 టీఎంసీలతో డామ్ కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు అధికారులు.
ఆ విషయాన్ని జలవనరులశాఖ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. తాను స్వయంగా నీటిని విడుదల చేస్తానని చెప్పడంతో అప్పటికప్పుడు సీఎం శ్రీశైలం పర్యటన ఖరారైంది. కృష్ణమ్మకు హారతి ఇచ్చిన తర్వాత శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు.
గతేడాది జులై 30న ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈసారి మూడు వారాల ముందు గేట్లు ఓపెన్ చేస్తున్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు నుంచి 15 వేల క్యూసెక్కులను వెలుగోడు జలాశయానికి పంపుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహించే అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు ప్రతీ ఏటా వేల మంది అక్కడికి వస్తుంటారు. మంగళవారం గేట్లు ఓపెన్ చేయడంతో డ్యామ్‌కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.