AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నారు. ఈ వర్షాలతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పంట పొలాలు నీటమునిగాయి, రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో జనజీవనంపై తీవ్రంగా ప్రభావితం చూపుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర నుండి దక్షిణ ఒడిశా వరకు పయనిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వం కూడా అప్రమత్తమై, వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసి, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతోంది. వర్షాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం ఈరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు సెలవులు ప్రకటించింది. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో కూడా కలెక్టర్లు సెలవులను ప్రకటించవచ్చని సూచన జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
మరోవైపు గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో అత్యధికంగా 19 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. తెనాలి లో 18 సెం.మీ, కారంపూడి లో 15 సెం.మీ, అమరావతి, అవనిగడ్డ లో 14 సెం.మీ వర్షం నమోదైంది. విజయవాడలోనూ నిరంతరంగా కురుస్తున్న వాన కారణంగా రోడ్లపైకి భారీగా నీరు చేరింది. దీని వల్ల ప్రయాణికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ బృందాలు ప్రజల సురక్షత కోసం కృషి చేస్తున్నారు. ప్రజలు తక్షణం అప్రమత్తంగా, సురక్షిత ప్రదేశాల్లో ఉండటం అత్యంత అవసరమని సూచిస్తున్నారు. భవిష్యత్తులో వర్షాలు, నదుల ప్రవాహం పరిస్థితిని మరింత ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి, వర్షపాతం, వరద సమాచారం కోసం స్థానిక వార్తలపై కచ్చితంగా దృష్టి పెట్టడం అవసరమని అధికారులు తెలిపారు. వర్షాల, నదుల ప్రవాహం, సురక్షిత ప్రాంతాల సంబంధించి తాజా సమాచారం మీకు అందిస్తూనే ఉంటామని అధికారుల వెల్లడించారు.