Perni Nani: మచిలీపట్నం వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, నిత్యావసరాల ధరలతో సామాన్యుల నడుము విరిచారని విమర్శించారు.
ఆకాశాన్నింటిన నిత్యావసర ధరలు
ప్రజలు బతికే పరిస్థితి లేకుండా ధరలను పెంచేశారని పేర్ని నాని మండిపడ్డారు. 26 కేజీల బియ్యం కట్ట ధర రూ. 2600 దాటిందని, కేజీ బియ్యం రూ. 100కి చేరితే సామాన్యులు ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. ‘లక్ష కోట్ల ఆస్తి ఉన్న మీ సతీమణికి బియ్యం తినే అవసరం లేకపోవచ్చు, కానీ పేద ప్రజలు బియ్యమే తినాలి కదా!’ అని చంద్రబాబును నిలదీశారు. చింతపండు రూ. 300, వేరుశెనగ నూనె రూ. 190, ఉల్లిపాయలు రూ. 60కి చేరి నిత్య జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హెలికాప్టర్ విహారాలు.. అప్పుల ఊబి!
ప్రజల సొమ్ముతో నాయకులు హెలికాప్టర్లలో విహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల హయాంలో రూ. 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ఈ రెండున్నరేళ్లలోనే కూటమి ఏకంగా రూ. 4 లక్షల కోట్ల అప్పు చేసిందని ఎండగట్టారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అసలు రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రతి వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.
పంచాయతీ నిధుల దారి మళ్లింపు
స్థానిక సంస్థలు, పంచాయతీల అభివృద్ధి పూర్తిగా పడకేసిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ఖర్చు పెట్టలేని దుస్థితి నెలకొందని, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లో జమ చేయలేకపోయారని విమర్శించారు. పొత్తుల పేరుతో సొంత కార్యకర్తల త్యాగాలను పవన్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమాలు.. నామినేషన్ల చించివేత
నామినేషన్ల ఘట్టంలో రిటర్నింగ్ అధికారుల ముందే పత్రాలను చించివేయడం, డీఎస్పీల స్థాయి అధికారులతో బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. 130 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం అన్నీ ఫేక్ అని తేలిపోయాయని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు వేప బెత్తంతో కొట్టి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీరికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.
Also Read: ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!