Wedding Comedy Drama: గుజరాతీ సంస్కృతి, అందమైన కుటుంబ బంధాలు, పెళ్లి నేపథ్యంతో పూర్తిగా నవ్వులు పూయిస్తూనే… మరోవైపు చక్కటి భావోద్వేగాలను పంచే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హే జూ వాట్ చాలే చె’ (Haju Vaat Chaale Che). ఈ సినిమాలో ఒకే ఒక అమ్మాయి ఏడుగురు వేర్వేరు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ? ఆమె ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి పాట్లు పడింది ? అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. కేవలం సరదా సన్నివేశాలకే పరిమితం కాకుండా, కుటుంబ విలువలు, బంధాల ప్రాముఖ్యతను ఇందులో చాలా అందంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సులభంగా కనెక్ట్ అయ్యే చక్కటి క్లీన్ హ్యూమర్ ఇందులో ఉంది. మరి ఇలాంటి సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అనే విషయంలోకి వెళ్తే…
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాదు… రెండు కుటుంబాలను కూడా కలిపే వేడుక. ముఖ్యంగా గుజరాతీ కుటుంబాల్లో పెళ్లి సంబరాలు, సంప్రదాయాలు, బంధువుల హడావుడి ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఒక అమ్మాయి పెళ్లి వ్యవహారం అనూహ్యంగా ఏడుగురు పెళ్లికొడుకుల దగ్గరకు చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఈ విచిత్రమైన పాయింట్‌నే సినిమాకి ప్రధాన ఆధారంగా తీసుకున్నారు.
సాధారణంగా పెళ్లి చూపులు అంటే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు తెలుసుకోవడం, కుటుంబాలు మాట్లాడుకోవడం, చివరకు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి చుట్టూ ఏడుగురు పెళ్లికొడుకులు ఉండటంతో ప్రతి సందర్భం కొత్త గందరగోళానికి దారితీస్తుంది. ఒక్కో పెళ్లికొడుకు, ఒక్కో కుటుంబం, వారి అంచనాలు… ఇలా పెళ్లి వ్యవహారం ముందుకు సాగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయి. ఈ పరిణామాలు ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఉంటాయి.
మరోవైపు అమ్మాయి జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆమె అభిప్రాయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి ? కుటుంబం కోరుకునేది ఒకటైతే, వ్యక్తిగతంగా ఆమె ఆశించేది మరొకటైతే ఏం జరుగుతుంది ? ఇలాంటి అంశాలను వినోదంతో ముడిపెట్టడం ఈ చిత్రానికి ప్రత్యేకత. అయితే ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య ఈ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు చివరకు ఎలాంటి నిర్ణయానికి దారితీస్తాయి ? ఆమెకు నచ్చిన జీవితం దక్కుతుందా ? కుటుంబ సభ్యులు ఆమె మనసును అర్థం చేసుకుంటారా ? అనేది తెరపై చూడాల్సిందే.
‘హే జూ వాట్ చాలే చె’ గుజరాతీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అక్టోబర్ 22న షమరూమీ (ShemarooMe) ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కుటుంబంతో కలిసి చూడగలిగే కామెడీ, పెళ్లి సందడి, భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. ఝాన్వీ గుర్నాని, రౌనక్ కామ్దార్, అనురాగ్ ప్రపన్న ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ భోలే, వినీత్ కనోజియా దర్శకత్వం వహించారు.
Read Also: నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు