Rajahmundry Mayor: 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై ప్రజలు గొప్ప నమ్మకంతో విజయం అందించారు. రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా రేలంగి శ్రీదేవిని గెలిపించండి అని ఎంపీ పురందరేశ్వరి అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసి అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించామని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనతోనే వికసిత భారతదేశం సాధ్యమవుతుందని, ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని, వికసిత రాజమండ్రి సాధనతో వికసిత ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేయాలని అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్‌లో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి గెలుపుతో అభివృద్ధికి మరింత అవకాశం ఉందని బంగారు రాజమండ్రి నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత రైల్వే కనెక్టివిటీ, కొత్త రైళ్లు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, రహదారుల అభివృద్ధితో పాటు విమానాశ్రయ కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేసామన్నారు.
Also read: చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్
మహిళా రిజర్వేషన్లకు ప్రాధాన్యత కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్రంలోనూ మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. మహిళల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న గౌరవం పథకాల అమలులో స్పష్టమవుతోంది. 2024 ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉండేదని ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. నామినేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతోంది. రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా బీజేపీ మహిళా అభ్యర్థి సోదరి రేలంగి శ్రీదేవికి మద్దతు ఇవ్వాలని అన్నారు. మహిళా సమస్యలపై అవగాహనతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం శ్రీదేవికి ఉందని సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేశారని అన్నారు. బంగారు రాజమండ్రి నిర్మాణం కోసం కూటమి అభ్యర్థిని గెలిపించాలని, మూడు పార్టీల గుర్తులు వేర్వేరైనా కూటమి లక్ష్యం ఒక్కటేనని.. కమలం, గ్లాస్, సైకిల్ గుర్తుల అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. రాజమండ్రి అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Also read: ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !