Pawan Kalyan: కడప వెళ్లి వైసీపీ నేతలకు సూటిగా వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ వారికి కళ్ళు నెత్తికెక్కాయని, ఈ విషయంలో తాము సైలెంట్‌గా కూర్చోమన్నారు. వారిని ఎలా నియంత్రించాలో మాకు తెలుసన్నారు. అధికారులపై దాడులు చేసినా, అడ్డుకున్నా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. మీకు చట్టాలు తెలిసి ఉండొచ్చు అయినా శిక్షలు తప్పవని సూటిగా హెచ్చరించారు.
అన్నమయ్య జిల్లాలో గాలివీడు ఎంపిడీవోపై వైసీపీ నేతలు దాడి చేయడం భాదాకరమ న్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అధికారం పోయినా నేతలకు ఇంకా అహంకారం చావలేదన్నారు. అహంకారంతో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేశారన్నారు. సుదర్శన్‌రెడ్డి దాడి చేయడం కొత్త కాదన్నారు.
గతంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. శేఖర్ నాయక్ , ప్రతాప్, శ్రీనివాసరెడ్డి ఆయన బాధితులేనని చెప్పారు. సుదర్శన్ రెడ్డి అహంకారంతో ప్రవర్తించాడని, ఉద్యోగి కులాన్ని సైతం దూషించాడని గుర్తు చేశారు. మండలం అభివృద్ది చేసే ప్రభుత్వ అధికారిపై ఎంత ధైర్యం ఉంటే దాడి చేస్తారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం మాదిరిగా కూటమి సర్కార్ ఉండదని చెప్పకని చెప్పారు పవన్ కల్యాణ్. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మా ప్రభుత్వం సహించదని కుండబద్దలు కొట్టేశారు. అదనపు బలగాలతోపాటు సీఐని పంపిస్తే కానీ పరిస్దితి అదుపులోకి రాలేదన్నారు. అధికారులపై దాడి చేస్తే తాట తీస్తామని, తోలుతీసి కింద కూర్చోబెడతామన్నారు.
ALSO READ: పవన్ ప్రాణాలకు ముప్పు..! సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్?
రాయలసీమ యువత ఇప్పటికైనా మేలుకోండి, ఇలాంటి దాడులు ఎదుర్కొని వారిని నియంత్రించాలన్నారు. జవహర్ బాబును కులం పేరుతో దూషించి, రిటైర్డ్ అయినా చంపుతామని బెదిరించారంటే అహంకారం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
రాయలసీమలో ఆధిపత్య ధోరణి నసించాలని, ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా అధికారులకు పూర్తి పర్మిషన్లు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం. కడపలో రైతు కుటుంబం చనిపోవడం భాదాకరమన్నారు. ఎందుకు చనిపోయారనేది విచారణ జరుగుతోందన్నారు. అప్పులతో చనిపోయారా లేక ఎవరైనా బెదిరిస్తే చనిపోయారా అనేది విచారణలో తెలుస్తుందన్నారు. జిల్లాలో అటవీ భూములు అన్యాక్రాంతంపై ఇక్కడికే వచ్చి రివ్యూ చేస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.