Pawan Kalyan: బహుభాషా విధానంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ మన దేశ జాతీయ, సాంస్కృతిక సమైక్యత లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడవని పవన్ కల్యాణ్ అన్నారు.
హిందీని ఓ భాషగా తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే తాను వ్యతిరేకించానని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 లో కూడా హిందీని అమలు చేయనప్పుడు.. దాని అమలు గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
నూతన విద్యా విధానం 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. వారు హిందీని నేర్చుకోకూడదు అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను కూడా ఎంచుకోవచ్చని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడం ద్వారా జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం బహుభాషా విధానాన్ని రూపొందించింది. దీన్ని రాజకీయ అజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన చెప్పారు. బహు భాషా విధానంపై పవన్ కల్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం పూర్తిగా అవగాహనా రాహిత్యమే అవుతుందని అన్నారు ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉండాలన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.
అంతకు ముందు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన సభలో మాట్లాడుతూ.. సంస్కృతాన్ని తిడతారు, అన్ని దేశ్ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదు రాకూడదు అంటారు. నాకు అప్పుడు మనసులో ఒకటి అనిపించింది. అప్పుడు తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులు ఏమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి కావాలి, బీహార్ నుంచి కావాలి.. కానీ హిందీ మాకు వద్దంటే ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. పనిచేసే వాళ్లంతా మనకి బీహార్ నుంచి రావాలి హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. అందుకని భాషల్ని ద్వేషించవలసిన అవసరం లేదు అంటూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ మాటలు వింటుంటే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మరోసారి గుర్తొచ్చింది. ఎందుకంటే ఇదే మాదిరిగా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఈక్రమంలోనే ఈ రోజు ఆయన ట్విట్టర్ వేదికగా బహుభాషా విధానంపై స్పందించారు.
ALSO READ: NCL Recruitment: సువర్ణవకాశం.. పదో తరగతి అర్హతతో 1765 పోస్టులు, ఇంకా 3 రోజులే గడువు..