Minister Uttam Kumar Reddy: SLBC ప్రాజెక్ట్ పై చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ప్రమాదం జరిగిన పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. లోపల ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ALSO READ: UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..
ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం..
‘ఎస్ఎల్‌బీసీ ప్రమాదం అనుకోకుండా జరిగింది. టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వశక్తులా ఒడ్డుతున్నది. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించాం. బాధితులను రక్షించడం కోసం 10 సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. నీటి లీకేజి వలన బురద జారి ప్రమాదం జరిగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. అక్కడ బురద పేరుకు పోవడం వలన రెస్క్యూ కొంత ఇబ్బందిగా మారింది. ఇండియన్ ఆర్మీ, నేవి, NDRF, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ వంటి 10 ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి..
‘దేశంలో, ప్రపంచంలో నైపుణ్యం ఉన్న ఇంజనీర్లందరిని పిలిపించాం. ప్రమాదంతో 8 మంది ప్రాణాలతో ముడిపడ్డ సంఘటన జరిగితే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వారు ఈ దుర్మార్గమైన రాజకీయాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా టన్నెల్ ప్రమాదం జరిగి 7 మంది చనిపోతే మేం రాజకీయ విమర్శలు చేయలేదు. ప్రపంచంలో 3 వేల కిలోమీటర్ల టన్నెల్ తవ్విన అనుభవం రాబిన్స్ సంస్థ సొంతం. అటువంటి రాబిన్స్ సంస్థ ఆధ్వర్యంలో టన్నెల్ పనులు చేస్తున్నాం. ఎస్.ఎల్.బీ.సి అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది పూర్తయితే శ్రీశైలంలో అడుగు భాగం నుంచి నీళ్లు తీసుకురావచ్చు’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇది దేశంలో మూడో టన్నెల్ ప్రమాదం..
‘ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గ్రావిట్ ద్వారా 30 టీఎంసిీల నీరు నల్గొండ జిల్లాకు అందించి.. జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఫ్లోరైడ్‌తో ఇబ్బంది పడుతున్న లక్షల మంది జీవితాలను మార్చే ప్రాజెక్ట్ ఎస్.ఎల్.బీ.సి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 టీఎంసిల నీళ్లు ఎలాంటి విద్యుత్ గానీ, మోటార్లు గాని లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా వస్తుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని అమెరికన్ రాబిన్స్ కంపెనీ ప్రతినిధి, ప్రపంచంలో టాప్ టన్నెల్ నిపుణులు గ్లెన్స్ కూడా చెప్పారు. ఇది భారత దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.
ALSO READ: SBI Recruitment: శుభవార్త.. SBIలో 1194 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
సీఎంతో చర్చించి చర్యలు చేపడుతాం..
‘ఇలాంటి టన్నెల్ ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. అక్కడ రెండు చోట్ల ఎగ్జిట్స్ ఉండటం వల్ల టన్నెల్ లో చిక్కుకున్నవారిని కాపాడటం సులువైంది. కానీ, ఇక్కడ ఒకసైడ్ మాత్రమే ఉండటం వల్ల ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడటం కాస్త ఇబ్బందిగా మారింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు జీయోలాజికల్ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు చెయ్యాల్సిన అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మరింత ముందుకు వెళ్లేందుకు కావాల్సిన చర్యలను చేపడుతాం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.