Aamani: ఒకప్పుడు హీరోయిన్లుగా సీనియర్ హీరోలతో జోడీకట్టి ప్రేక్షకులను అలరించిన చాలామంది.. ఇటీవల తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తల్లి పాత్రలు అయినా పర్వాలేదు అంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ఆమని కూడా ఒకరు. అసలు ఎవరూ ఊహించని సమయంలో తన రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆమని. ఇప్పుడు పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయిపోయారు. తాజాగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న కష్టాల గురించి బయటపెట్టారు ఆమని. అంతే కాకుండా తను కలర్ తక్కువ ఉండడం వల్ల ఎదుర్కున్న ఇబ్బందుల గురించి కూడా మాట్లాడారు.
హీరోయిన్ అవ్వకపోతే చచ్చిపోతా
సినీ పరిశ్రమలో పెద్దగా కాంటాక్ట్స్ లేకపోయినా హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆమని. ముందుగా కోలీవుడ్‌లో తనకు హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ నుండి కూడా మంచి ఆఫర్లు అందుకుంటూ ఇక్కడే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నారు. ‘‘హీరోయిన్ అవ్వకపోతే చనిపోతాను అని పోరాడి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పట్లో హీరోయిన్స్ అందరినీ చూసి వాళ్లలాగా నేను కూడా చేయాలి అనుకునేదాన్ని. అలా ఇండస్ట్రీలోకి రాగానే హీరోయిన్ అయిపోతాను అనుకున్నాను. కానీ వచ్చి చూసిన తర్వాతే తెలిసింది అంత ఈజీ కాదు అని’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు ఆమని.
ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయేవి
‘‘అప్పట్లో అయితే హీరోయిన్‌గా చేయాలి లేదా అక్క పాత్ర, చెల్లి పాత్ర, ఫ్రెండ్ రోల్ ఇలాంటివి చేయాలి. లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలి. నేను మాత్రం హీరోయిన్‌గానే చేయాలి అనుకున్నాను కాబట్టి చాలా కష్టాలు ఎదుర్కున్నాను. ముందుగా నేను తమిళ ఇండస్ట్రీలోనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అక్కడే కష్టాలుపడ్డాను. తెలుగులో కష్టాలేమీ చూడలేదు. తమిళంలో నేను పడిన కష్టాలకు హీరోయిన్ ఛాన్స్ దొరికింది. కానీ తెలుగులోనే ఎక్కువ సక్సెస్ అయ్యాను. మొదట్లో నా ఫోటోలు, ఆల్బమ్స్ చూసి వెంటనే నన్ను పిలిచేవారు. కానీ నేరుగా చూడగానే వారి ఎక్స్‌ప్రెషన్ మారిపోయేది. వారి అంచనాలు వేరే లెవెల్‌లో ఉండేవి’’ అంటూ తను కలర్ వల్ల ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు ఆమని (Aamani).
Also Read: 37 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్.. విడాకుల బాట పడుతున్న సీనియర్ హీరో
అక్కడే ఫెయిల్
‘‘నేను నార్త్ ఇండియన్ కలర్ కాదు. చూసిన వెంటనే బాగుంది అనిపించాలంటే కలర్ ఉండాలి. అక్కడ నేను ఫెయిల్ అయ్యేదాన్ని. కొందరు బాగా మాట్లాడతారు. నేను అలా మాట్లాడలేను. అడిగినదానికి మాత్రమే సమాధానం ఇస్తాను. ఒకప్పుడు హీరోయిన్స్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ చూసి అవకాశాలు ఇచ్చేవారు. కానీ నేను వచ్చే సమయానికి ట్రెండ్ చాలా మారింది. అప్పట్లో కలరే కావాలి అనుకునే దర్శకులు ఎక్కువమంది ఉండేవారు. అందుకే నన్ను ఎందుకు మంచి కలర్‌లో కనలేదని మా అమ్మను తిట్టేదాన్ని’’ అంటూ నవ్వుతూ చెప్పారు ఆమని. ఇప్పుడు కలర్‌తో సంబంధం లేకుండా డస్కీ అని పేర్లు పెడుతూ ట్రెండ్ మార్చారని చెప్పుకొచ్చారు.