BigTV English

Mylavaram Politics: రంజురంజుగా మైలవరం రాజకీయం..

Mylavaram Politics: రంజురంజుగా మైలవరం రాజకీయం..
Vasantha Krishna Prasad

Devineni Uma Vs Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజక వర్గంలో రాజకీయం రోజురోజుకూ రంగులు మారుస్తోంది. అక్కడి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కొంతకాలంగా పార్టీ మారటం దాదాపు ఖాయమైంది. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడిగానే గాక వ్యక్తిగతంగానూ మంచి గుర్తింపు గల నేతగా కృష్ణప్రసాద్‌ జనంలో నిలిచారు. టీడీపీకి కంచుకోట అయిన మైలవరంలో నాటి సీనియర్ నేత, నాటి నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు మీద 2019 ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు.


అంతేకాదు.. గత నాలుగేళ్లుగా ఉమాకు ఆయన రాజకీయంగా చుక్కలు చూపిస్తూ తన సత్తా చాటుతూనే వచ్చారు. ఒకదశలో మంత్రి పదవికి ఆయన పేరు కూడా వినిపించినా సామాజిక సమీకరణాలు కుదరక అది సాధ్యపడలేదు. కానీ.. ఆయన ఎక్కడా దీనిపై తన అసంతృప్తిని వెల్లడించలేదు. వైసీపీని నియోజకవర్గంలో ఇంటింటికీ తీసుకుపోవటమే గాక పార్టీలకు అతీతంగా, ఎలాంటి వివక్షా లేకుండా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలను అందేలా చొరవ తీసుకుని, అందరివాడు అనిపించుకోవటంలో సఫలమయ్యారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే హుందాగా రాజకీయాలు చేస్తున్నారనే పేరూ ఆయన సంపాదించుకోగలిగారు.

అయితే.. తాజాగా తొలిసారి ఆయన వైసీపీ నాయకత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. ‘నా రాజకీయ భవిష్యత్తు.. ఎప్పుడు ఎలా మారుతుందనేది నా చేతిలో లేకుండా పోయింది. ఇక.. నా భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. వైసీపీ హయాంలో ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైకాపా నేతలు ఆస్తులు అమ్ముకున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు’ అని ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


అయితే.. ఆయన టీడీపీ మీద ఏమీ మాట్లాడకపోవటం, పైగా.. కమ్మసామాజిక వర్గానికి చెందినవాడవటం, ఆయన తండ్రి నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఏపీకి హోంమంత్రిగా పనిచేయటంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. దీనికి ఆయన అవుననీ గానీ, కాదని గానీ జవాబివ్వకపోవటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో.. నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా ఆయన టీడీపీ నుంచి బరిలో దిగితే వనరులు, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇబ్బందేమీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీడీపీ అధినాయకత్వమూ ఆయనను పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇంత జరుగుతున్నా.. సీఎం జగన్.. కృష్ణ ప్రసాద్‌ను పిలిచి మాట్లాడటంగానీ, బుజ్జగించటం గానీ చేయకపోవటం ఈ అనుమానాలకు మరింత తావిచ్చింది. పైగా.. ఆదివారం మైలవరం అసెంబ్లీ వైకాపా ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. శుక్రవారం తిరుపతిరావు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌‌ను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. మైలవరం పరిణామాలను మంత్రి జోగి రమేశ్‌, ఎంపీ కేశినేని నానితో చర్చించిన సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ పరిణామాలన్నీ ఇప్పుడు టీడీపీలో మంటలు పుట్టిస్తున్నాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మైలవరం ఇన్‌ఛార్జ్ దేవినేని ఉమామహేశ్వరావు.. తాజా పరిణామాలపై దీటుగా స్పందించారు. మైలవరం వైసీపీ ఇన్‌చార్జ్ మారిన ఆదివారం రోజునే ఆయన నియోజకవర్గంలోని గుంటుపల్లి సీఏ కన్వెన్షన్‌ హాల్లో ఆదివారం జరిగిన ‘మీటింగ్‌ విత్‌ లీడర్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేశినేని నాని, వసంత కృష్ణప్రసాద్‌, సుజనా చౌదరి వేర్వేరు పార్టీల్లో ఉంటూ తప్పుడు రాజకీయం చేస్తూ తమ వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారని ఆరోపించారు. తాను మాత్రం పాతికేళ్లుగా పసుపు జెండాను మోస్తున్నానని, ఆరునూరైనా తాను మైలవరం నుంచే టీడీపీ తరపున పోటీచేస్తానన్నారు.

పైగా.. వచ్చేవారం నుంచే నియోజకవర్గంలోని అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు. పార్టీ మారాలని తనను గతంలో చాలామంది ఇబ్బందిపెట్టినా తాను పార్టీ వీడలేదని చెబుతూనే.. వసంత కృష్ణ ప్రసాద్ వస్తే సహకరించేది లేదనే సందేశాన్ని పార్టీ అధిష్ఠానానికి పరోక్షంగా అందించినట్లయింది. దీంతో నిన్నటి దాకా అధికార పార్టీలో మంటలు పుట్టించిన మైలవరం రాజకీయం.. నేడు విపక్ష టీడీపీలో కాకరాజేస్తోంది.

Related News

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

Big Stories

×