Big Stories

YS Sunita Press Meet : జగన్‌కు ఓటు వేయకండి.. వైఎస్ సునీత పిలుపు

YS Sunita Press Meet

- Advertisement -

YS Sunita Press Meet on Viveka Murder Case(Andhra politics news): వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తులో మీడియా సపోర్ట్ కావాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి కోరారు. శుక్రవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన సునీత.. వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య జరిగి ఐదేళ్లు, కేసు దర్యాప్తు మొదలై నాలుగేళ్లయినా.. ఇంకా ప్రధాన నిందితులెవరో తేలకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక హత్యకేసును ఛేదించేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందోనని ప్రశ్నించారు.

- Advertisement -

తన తండ్రి హత్య కేసుపై ఈ రోజు మీడియా ముందుకు రావడానికి 2 కారణాలున్నాయని సునీత తెలిపారు. వివేకా హత్యకేసు ముందుకు వెళ్లడానికి మీడియా సపోర్ట్ తో పాటు ఏపీ ప్రజల మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. తాను తెలిసిన వాళ్లు, తనకు తెలియని వాళ్లంతా.. ఎక్కడికెళ్లినా వివేకానంద హత్య కేసు గురించే అడుగుతున్నారని సునీత తెలిపారు. తనకు సపోర్ట్ గా నిలిచిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, రఘురామకృష్ణంరాజుకు ధన్యవాదాలు తెలిపారు.

Read More : ప్రజాగళం..! టీడీపీ మరో కొత్త కార్యక్రమం..

సొంతవారికే న్యాయం చేయలేని వారు.. రాష్ట్ర ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తారన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు జగన్ అండగా ఉన్నారని, ఈసారి జరిగే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయొద్దని సునీత మీడియా ముఖంగా పిలుపునిచ్చారు. జగన్ పై ఉన్న 11 కేసుల మాదిరిగానే వివేకా హత్యకేసు మరుగున పడిపోకూడదని ఆమె ఆశించారు. మంచికి – చెడుకి యుద్ధం జరుగుతుందని చెప్పే జగన్.. చెల్లెలికి ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. సీఎం బాబాయ్ హత్యకు గురి కావడం అంటేనే పెద్దకేసు. అలాంటి ఈ కేసును ఎందుకు పక్కన పెట్టారన్నది తెలియాలన్నారు.

గతేడాది జూన్ 3న ఎంపీ అవినాష్ రెడ్డిని వివేకా హత్యకేసులో సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న భయంతో.. తన తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడని సునీత ఆరోపించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. సీబీఐ ఎంక్వైరీకి సహకరించాలని కోర్టు చెప్పగా.. దానికి కూడా అవినాష్ రెడ్డి సహకరించలేదన్నారు. 2019 మార్చి 14-15 తేదీల్లో వివేకానంద హత్యకు గురయ్యారని, ఆ తర్వాత మార్చురీ వద్ద అవినాష్ తనతో మాట్లాడుతూ.. పెద్దనాన్న నాకోసం 11.30 వరకూ ప్రచారం చేశారని చెప్పాడన్నారు సునీత. అప్పుడలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదన్న ఆమె.. నిందితులు మనమధ్యే ఉన్నా ఒక్కోసారి మనం తెలుసుకోలేమన్నారు.

Read More : ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్.. 14 రోజులు రిమాండ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినోళ్లే తన తండ్రిని ఓడించారని, పోటీ నుంచి తప్పించేందుకు ఎంత చేసినా ఆయన లొంగకపోయే సరికి కక్షగట్టారని ఆరోపించారు సునీత. వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ ను అడిగితే.. అలా చేస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్లిపోతాడని అన్నారని తెలిపారు. ఆ తర్వాతే తాను సీబీఐకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. పేదలకు పెత్తందారులకు పోరాటం అనే జగన్.. తన తండ్రిని పెత్తందారులను ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఒకప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగినవారే ఇప్పుడు అడ్డు తగులుతున్నారని, సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారని ఆరోపించారు.

ఈ కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని ఎందుకు విచారించలేదు ? గొడ్డలితో చంపారని జగన్ ఎలా చెప్పారు ? అవినాష్ రెడ్డిని జగన్ ఎందుకు కాపాడుతున్నారు ? ఈ విషయాలన్నీ బయటికి రావాలన్నారు. నేరస్తుడైన అవినాష్ రెడ్డికి శిక్షపడి తీరాలని సునీత పేర్కొన్నారు. సొంత వాళ్లని అంత తొందరగా అనుమానించలేం గనుకే.. ఆనాడు జగన్ పై తనకు అనుమానం రాలేదన్నారు. వివేకా హత్య తర్వాత దస్తగిరికి నిజం చెప్పకుండా ఉండేందుకు రూ.20 కోట్లు ప్రలోభ పెట్టినట్లు తనకు తెలిసిందన్నారు.

Read More : షర్మిలనా.. మజాకా.. ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇంటర్వ్యూలు..

తన తండ్రి వివేకా హత్య కేసులో న్యాయం కోసమే పోరాడుతున్నానని సునీత వెల్లడించారు. న్యాయం కోసమే ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్నదానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, త్వరలోనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ.. తనతో సహా అందరినీ విచారించాలని మరోసారి ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News