ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఆమధ్య ఆయన ఏదో ఊరూపేరూ లేని యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అది కూడా తన స్నేహితురాలు మాధురితో కలసి. ఆ తర్వాత ఉగాది పురస్కారాలు అంటూ దువ్వాడ-మాధురి స్టేజ్ మీదే దండలు మార్చుకున్నారు. తాజాగా విద్యుత్ శాఖ ఏఈపై దువ్వాడ బూతులతో విరుచుకుపడ్డారు. ఇవన్నీ చూస్తున్నా ఇంకా దువ్వాడ విషయంలో జగన్ నోరు మెదప లేదు, కనీసం పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదు. భార్యని వదిలిపెట్టి, ప్రియురాలితో పబ్లిక్ గా తిరుగుతున్న దువ్వాడ ఏపీ పెద్దల సభలో తమ పార్టీ సభ్యుడు అని చెప్పుకోడానికి కూడా వైసీపీకి పరువు తక్కువే.
రాజకీయ నాయకులైనంత మాత్రాన కుటుంబ కలహాలు ఉండకూడదు అనుకోలేం. ఆ మాటకొస్తే వివాహాల విషయంలో కూడా ఎవరి వ్యక్తిగత నిర్ణయాన్ని ఇంకెవరూ తప్పుబట్టడానికి లేదు. అయితే దానికి కూడా ఓ పద్ధతుంటుంది. రెండో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలనేది చట్టం. కానీ ఆచట్టాన్ని పక్కనపెట్టి, భార్యని వదిలిపెట్టి, ఎంచక్కా ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈమధ్య వీరి జోరు బాగా ఎక్కువైంది. మీడియా వీరిద్దర్నీ హైలైట్ చేయడంతో దువ్వాడ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాధురి జంటగా ఆయన కెమెరాలముందు ఇస్తున్న ఫోజులు వైరల్ గా మారుతున్నాయి.
కూతురు వయసున్న మహిళతో దువ్వాడ సాన్నిహిత్యం ఎంతవరకు కరెక్ట్..? ఆ విషయం తెలిసినా కూడా ఆయన్ను వైసీపీ వెనకేసుకు రావడం ఇంకెంత వరకు కరెక్ట్. గతంలో పవన్ కల్యాణ్ వివాహాల గురించి తీవ్ర విమర్శలు చేసిన జగన్, దువ్వాడ కథపై మాత్రం నోరు మెదపడం లేదు. కనీసం ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడం విశేషం.
దువ్వాడలో ప్రేమాయణం అనే యాంగిల్ మాత్రమే కాదు, బూతుల కోణం కూడా ఉంది. కరెంటు బిల్లు కట్టకుండా ఆపేసి, కనెక్షన్ తొలగించినందుకు ప్రభుత్వ అధికారిపై ఆయన దుర్భాషలాడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఆడియో బయటపడిన తర్వాత వైసీపీని జనం మరింతగా చీదరించుకుంటున్నారు. ఇలాంటి వారందర్నీ ఆ పార్టీలో జగన్ ఎందుకు ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించని దువ్వాడ, కనెక్షన్ తీసేసినందుకు ఏఈపై బూతులతో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ కి ఫోన్ చేసి బూతులు తిట్టి బెదిరించారు. మురళీమోహన్ దళిత వర్గానికి చెందిన అధికారి కావడంతో ఆ సామాజిక వర్గం భగ్గుమంది. దళితులంటే అంత చులకనా అని వారు మండిపడ్డారు. కనీసం ఈ విషయంలో అయినా జగన్ స్పందించాలని, దళిత అధికారిని బూతులు తిట్టిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దువ్వాడ వ్యక్తిగత విషయాలను ఎవరూ పెద్దగా ప్రశ్నించకపోయినా, ఇప్పుడిలా అధికారులపై బూతుల దండకంతో విరుచుకుపడటం మాత్రం కచ్చితంగా ఖండించాల్సిన విషయమే. దువ్వాడ లాంటి నాయకుడు టీడీపీలో ఉంటే కచ్చితంగా వైసీపీ నుంచి కౌంటర్లు పడేవి, జగన్ కూడా ఏమాత్రం సందేహించకుండా విమర్శించేవారు. మరి అదే నాయకుడు వైసీపీలో ఉంటే మాత్రం ఆ పార్టీ నోరు మెదపడం లేదు.