Earthquake in AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరోసారి భూమి కంపించింది. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు రెండు సెకన్ల పాటు భూకంపం వచ్చింది. భయంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిన్నకూడా 10 గంటల 35 నిమిషాలప్పుడు ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం రిక్టర్ స్కేల్ పై 3.1 గా నమోదు అయింది. గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకుంటున్న.. అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తున్నట్టు గుర్తించారు. గత మూడేళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు వారాల వ్యవధిలో ఏపీలో భూ ప్రకపంపనలు రావడం ఇది రెండోసారి.
ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, బుట్టయగూడెం, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది.
55 సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని సైంటిస్టులు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఈ తీవ్రతకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి.
Also Read: బన్నీకి పురంధేశ్వరి సపోర్ట్.. మరి భాదితుల సంగతేంటి?
అయితే ఈ భూకంపాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఉండదని తెలుస్తోంది. ప్రతి 50 సంవత్సరాలకి ఒకసారి భూమిలోని ప్లేట్స్ సర్దుకుంటూ ఉంటాయి. సునామీలు వచ్చే అంత ప్రమాదకరమైన భూకంపమైతే తెలుగు రాష్ట్రాలకు లేదు. నిజానికి తెలుగు రాష్ట్రాల భౌగోళిక ప్రాంతం యాక్టివ్ గా కదిలే ప్లేట్లకు దూరంగా ఉంది. కాబట్టి భూకంపాల వల్ల భారీ నష్టాలు జరిగే ప్రమాదం చాలా తక్కువే.