AP Politics: టీడీపిలో జిల్లా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలయింది. అయితే ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి భారీ స్థాయి లో పోటీ ఉంది.. పార్టీ అధికారంలో ఉండడమే ప్రధాన కారణం అనే చర్చ బాగా జరుగుతోంది. జిల్లా స్థాయిలో పార్టీ పదవుల కోసం సీనియర్లు, యువ నేతలు తెగ పోటీ పడుతున్నారంట. పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇస్తామని అధిష్టానం భావిస్తున్న తరుణంలో ముందు నుంచి ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడిన నాయకులు రేసులోకి వస్తున్నారంట..
జిల్లా టీడీపీ అధ్యక్షుల నియామకానికి కసరత్తు
టీడీపీ లో సంస్థాగత ఎన్నికలు, జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఈ సారి పార్టీ టీంలో యువత, మహిళలతో పాటు కీలకంగా ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించనుంది టీడీపీ అధిష్టానం. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం అయింది.. ముగ్గురు పరిశీలకులు జిల్లాల వారీగా అభ్యర్థులకు సంబంధించి స్క్రూటినీ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారంట.
జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం పెరుగుతున్న ఆశావహులు
ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి ఆశావహులు ఎక్కువగా ఉన్నారట, ప్రతి జిల్లాలో కనీసం నలుగురు పోటీ పడుతున్నారట. గతంలో పార్టీ అధికారం లో లేనప్పుడు ఏదో తూతూ మంత్రంగా అధ్యక్షుల ఎంపిక జరిగేది. అయితే ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడం.. యువత కు ఎక్కువ అవకాశాలు ఇస్తామనండంతో పోటీ బాగా ఎక్కువైనట్టు సమాచారం. అందులో భాగంగానే ఆశావహులు తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారంట. పార్టీ అధికారంలో ఉండడంతో పదవులకు డిమాండ్ బాగా ఉందని టాక్. అధికారంలో ఉంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు పవర్ ఫుల్ గా ఉంటారని, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా సమన్వయం తో ఉంటే మేలు జరుగుతుందని కొంతమంది భావిస్తూన్నారట. అందుకే అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ పడుతున్నారట..
కడప జిల్లాలో అధ్యక్ష పదవికి ఏడుగురు పోటీ
జిల్లా అధ్యక్ష పదవి అంటే కొంత వరకు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇందుకోసమే పోటీ ఎక్కువైందట.క డప జిల్లాలో అధ్యక్ష పదవికి ఏడుగురు పోటీ లో ఉన్నారు. అన్నామయ్య జిల్లాలో 20 మందికి పైగా పోటీ లో ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధంఅవుతోంది. శ్రీకాకుళం, ఉభయగోదావరి. వైజాగ్, విజయనగరం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందట. అధికార పార్టీ అధ్యక్ష పదవి అంటే గౌరవంతో పాటు ఇతరత్రా సదుపాయాలు కూడా బాగా వస్తాయని భావిస్తున్నారట.. ఇందుకోసమే పోటీ ఎక్కువయ్యిందని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి.. ఏలూరు జిల్లా లో కమ్మ..కాపు సామాజిక వర్గాల మధ్య టీడీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ ఉందట.
Also Read: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!
వచ్చే ఎన్ని్కల్లో టికెట్ల వ్యవహారాల్లో మేలు జరుగుతుందనా?
జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మండల టీడీపీ అధ్యక్షులకు సంబంధించి కూడా గట్టి పోటీ నడుస్తోందట.. ప్రస్తుతం అధికారంలో ఉండడం.. పదవుల పంపిణీ. నామినేటెడ్ పోస్టులు.. కాంట్రాక్టులు.. ఇలా ఎదో రకంగా లబ్ది కోసమే ఇంత పోటీ ఉందని సమాచారం.. ఇలా కాలం గడిచిపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలకు టికెట్లు ఇతర వ్యవహారాల్లో కూడా మేలు జరుగుతుందని టీడీపీ అధ్యక్ష పదవులకు భారీగా డిమాండ్ వస్తోందట.
Story By Ajay Kumar, Bigtv