వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీస్ విచారణకు హాజరయ్యారు. విచారణకు ముందు, విచారణ తర్వాత ఆయన మాటల్లో తేడా స్పష్టంగా తెలుస్తోంది. తన వ్యాఖ్యలేవీ తప్పుకాదన్నట్టుగా గతంలో చెప్పారు ప్రసన్న. ఇప్పుడు మాత్రం తన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని సెలవిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవని సెలవిచ్చారు.
దేనికైనా సిద్ధం..
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఇంటిపై టీడీపీ సానుభూతిపరులు దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు ముదిరాయి. ప్రసన్న వ్యాఖ్యల్ని తప్పుబడుతూ మహిళా లోకం నిరసన వ్యక్తం చేయగా, తన ఇంటిపై జరిగిన దాడిని హైలైట్ చేస్తూ ప్రసన్న సానుభూతి పొందాలని చూశారు. ఇరు వర్గాలు పోటీ పోటీగా కేసులు పెట్టాయి. కేసుల తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతి రెడ్డి గురించి తానేమీ తప్పుగా మాట్లాడలేదని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని మరోసారి చెప్పారు. కేసులు పెట్టినా, అరెస్ట్ లు చేసినా తాను తగ్గేది లేదన్నారు. అంతగా జైలుకి వెళ్తే మాజీ మంత్రి కాకాణికి తోడుంటానని కూడా గంభీరంగా చెప్పేవారు ప్రసన్న. తీరా పోలీస్ విచారణ తర్వాత స్వరం మార్చారు.
రాతపూర్వక సమాధానం
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పెట్టిన కేసులో పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డిని విచారణకు పిలిపించారు. దీంతో ఆయన ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఆయన్ను 3 గంటలసేపు పోలీసులు ప్రశ్నించారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రసన్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హడావిడి చేశారు. తాజా కేసుకు సంబంధించి తనను పోలీసులు 40 ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఆ ప్రశ్నలన్నింటికీ రాతపూర్వకంగా తాను సమాధానమిచ్చినట్లు చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, ఇలాంటి విషయాల్లో కేసులు పెడితే జైళ్లు, కోర్టులు సరిపోవని అన్నారు. తానెక్కడా ప్రశాంతి రెడ్డి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఆరోజు తనతోపాటు స్టేజ్ పై ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టడం దారుణం అన్నారు. తన వ్యాఖ్యలకు నవ్విన వారిపై, చప్పట్లు కొట్టినవారిపై కూడా కేసులు పెట్టడం హాస్యాస్పదం అన్నారు.
వైసీపీకి డ్యామేజీ
ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు, ఆ తర్వాత తన తప్పుని ఆయన సమర్థించుకున్నారు కూడా. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు. పోలీస్ కేసులు పెట్టినా బెదిరేది లేదన్నారు. పోలీస్ విచారణ తర్వాత మాత్రం తన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారంటూ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రసన్న వ్యాఖ్యలతో నెల్లూరులో వైసీపీకి మరింత డ్యామేజీ జరిగిందని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.