ఇటీవల లిక్కర్ స్కామ్ పై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్, మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీకి అమ్ముడుపోయారని అన్నారు. అయితే అప్పటికప్పుడు విజయసాయి, జగన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. కాస్త గ్యాప్ తీసుకుని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్ ని పల్లెత్తు మాట అనకుండా, కోటరీ అంటూ విరుచుకుపడ్డారు. తనని కెలకొద్దని, ఇరిటేట్ చేయొద్దని అలా చేస్తే తాను కచ్చితంగా రియాక్ట్ అవుతానని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.
కోటరీ వల్లే..
తాను మౌనంగా ఉండడం వైసీపీలోని కోటరీకి సచ్చటం లేదని, అందుకే తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ లు పెట్టిస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. తాను రియాక్ట్ అయితే కోటరీకి నష్టమేమీ లేదని, కానీ జగన్ కి నష్టం జరుగుతుందని, అలా జరగాలని అనుకుంటోంది కాబట్టే కోటరీ తనను కెలుకుతోందని చెప్పారు. రాజకీయ అనుభవం లేని కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 గా ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
1/2: నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదు. అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 26, 2025
వెన్నుపోటు..
తనకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి తనను బలి పశువుని చేయాలని కోటరీ నిర్ణయించుకుందని అన్నారు విజయసాయిరెడ్డి. నాలుగేళ్లుగా వైసీపీలో తనను అవమానించారని, లేని అభాండాల్ని తన నెత్తి రుద్దబోతే.. భరించలేక తాను బయటకు వచ్చానన్నారు. 2011 లో 21 కేసులు పైన వేసుకున్నానని, ఇప్పుడు కూడా జగనే తనని అడిగి ఉంటే.. లిక్కర్ కేసు బాధ్యత కూడా తానే తీసుకుని ఉండేవాడినని అన్నారు. కానీ కోటరీ తనకు వెన్నుపోటు పొడిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేస్తే.. కోటరీ మాటలు నమ్మి తనను జగన్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఎవరో చేసిన నేరాలు నెత్తిన వేసుకుంటే తాను మంచివాడినని, అలా చేయకపోతే చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.
టీడీ జనార్దన్ తో మీటింగ్..
విజయసాయిరెడ్డి టీడీపీ నేతలతో రహస్యంగా సమావేశమవుతున్నారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. తాను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చారాయన. అయితే ఆ సమయంలో టీడీపీ నేత టీడీ టీడీ జనార్ధన్ అక్కడకు వస్తున్న విషయం తనకు తెలియదన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చారు.
అవసరమైతే లోకేష్ నే కలుస్తాకదా..?
తనకు అవసరం అయితే నేరుగా చంద్రబాబు, లోకేష్ నే కలిసేవాడిని అని, తాను వైసీపీలో లేను కాబట్టి.. వారు ఇప్పుడు తనకు రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదని అన్నారు విజయసాయిరెడ్డి. అయితే తాను జన్మలో టీడీపీలో చేరనని మరోసారి క్లారిటీ ఇచ్చారు. పోనీ వైసీపీ నేతలు అంటున్నట్టుగా.. తాను లిక్కర్ స్కామ్ లో రహస్యాలు టీడీపీ నేతలకు చెప్పి ఉండటం నిజమే అయితే.. అసలు స్కామే లేదని జగన్ అంటున్న మాటలు అవాస్తవమేనా అని ప్రశ్నించారు. స్కామ్ లేనప్పుడు తాను టీడీపీ నేతలతో ఏం చర్చిస్తానని లాజిక్ తీశారు విజయసాయిరెడ్డి. విజయసాయి ట్వీట్ పై వైసీపీ నుంచి రియాక్షన్ రావాల్సి ఉంది.