Police Twist : అతను ప్రకాశ్. ఏఆర్ కానిస్టేబుల్. ఓ కేసులో డిస్మిస్ అయ్యాడు. అప్పటి నుంచి అసహనంతో రగిలిపోతున్నాడు. తాను దళితుడిని కాబట్టే కుట్ర చేసి అధికారులు తన ఖాకీ యూనిఫాం తీసేశారని ఆరోపిస్తున్నాడు. జస్ట్ ఆరోపణ మాత్రమే కాదు.. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప, ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై అట్రాసిటీ కేసు కూడా పెట్టాడు. ఆ మేరకు గతంలో టూటౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ ముగ్గురు అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టి.. విచారణ జరిపించగా.. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రశాక్ ఆరోపణలన్నీ అసత్యాలంటూ నివేదిక ఇచ్చారు. అయినా వదిలిపెట్టని ప్రకాశ్.. కోర్టును ఆశ్రయించాడు. ఇక్కడే కేసు టర్నింగ్ తీసుకుంది.
కోర్టుకు రాకుండా అడ్డుకునేలా తనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారంటూ తాజాగా డిస్మిస్డ్ కానిస్టేబుల్ ప్రకాశ్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాలు, కూరగాయలు, సరకులు తెచ్చుకోవడానికి కూడా ఇంట్లో నుంచి బయటకు పోనివడం లేదు.. ఈ బాధలు భరించలేకున్నా.. మీ కాళ్లు పట్టుకుంటా, బయటకు పోనియండి సార్ అంటూ ఎస్పీని వేడుకుంటున్నట్టు ఉంది ఆడియోలో.
ప్రకాశ్ ఉంటున్న పోలీస్ క్వార్టర్ ను పోలీసులు రౌండప్ చేశారని అంటున్నారు. కొన్ని రోజులుగా ఆ ఇంటి ముందు పికెట్ ఏర్పాటు చేశారని.. ప్రకాశ్ బయటకు రాకుండా.. 10 మంది పోలీసులు షిఫ్టుల వారీగా కాపలా కాస్తున్నారని చెబుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులపై పెట్టిన అట్రాసిటీ కేసులో ప్రకాశ్ కోర్టుకు రాకుండా అడ్డుకునేందుకే ఇలా అతన్ని గృహ నిర్బంధంలో ఉంచారనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా.. ఓ మాజీ పోలీస్ ను.. పోలీసులు ఇలా రౌండ్ అప్ చేసి.. 24 గంటలూ కాపలా కాస్తుండటం ఆసక్తికరంగా మారింది.