Musk bird : 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్… పూటకో సంచలన నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పిట్ట చేతుల్లోకి వచ్చీరాగానే టాప్ ఎంప్లాయిస్ ను తొలగించిన మస్క్… ఇప్పుడు బోర్డు సభ్యులందర్నీ పీకేశాడు. ట్విట్టర్ బోర్డులో ఇప్పుడు ఆయనొక్కరే డైరెక్టర్. సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో ఈ వివరాలు వెల్లడించారు… మస్క్. తాను కొనక ముందు సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నవాళ్లు ట్విటర్ బోర్డు సభ్యులుగా కొనసాగబోరని మస్క్ ఆ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. అందులో మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేరు కూడా ఉంది.
ట్విట్టర్ సీఈఓ పదవిని కూడా మస్కే చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సీఈఓ పదవి నుంచి పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన తర్వాత మస్క్ కొత్త సీఈఓను నియమించలేదు. అయితే, ఫైలింగ్‌లో తానే ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మస్క్ పేర్కొన్నాడని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.
ట్విట్టర్లో మస్క్ తర్వాత అతిపెద్ద ఇన్వెస్టర్ ఎవరో కూడా… రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారానే బయటపడింది. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్‌కు చెందిన కింగ్‌డమ్ హోల్డింగ్ కంపెనీ… ట్విటర్‌లో దాదాపు 35 మిలియన్ల షేర్లను 1.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయనతో పాటు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సె కూడా ఇన్వెస్టర్ గా ఉన్నారు. జాక్ డోర్సే 978 మిలియన్ డాలర్లతో 18 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. వీళ్లిద్దరితో పాటు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కూడా ట్విట్టర్ ఇన్వెస్టరేనని ప్రచారం జరుగుతోంది.