Simhachalam Incident: సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం లోపలి గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. భారీ వర్షం, తీవ్రంగా వీచిన గాలుల వల్ల అప్పుడే నిర్మించిన గోడ కూలి భక్తులపై పడింది. ఈ ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ దుర్ఘటనలో చనిపోయారు. మధురవాడ సమీపంలోని చంద్రం పాలం గ్రామానికి చెందిన మహేశ్ (30), శైలజ(26) గా అధికారులు తెలిపారు. వీరితోపాటు శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతి చెందారు.
మహేశ్, శైలజ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్, శైలజ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శన కోసం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో.. రూ. 300 ప్రత్యేక దర్శనం కోసం క్యూలైన్ లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి వారిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఉమామహేశ్వరావు, శైలజ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు
దైవ దర్శనానికి వెళ్లిన తమ వారు లేరని తెలుసుకుని షాక్ అవుతున్నారు కుటుంబసభ్యులు. మేము ఏ పాపం చేశాం దేవుడా.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు.. హృదయాలను కలచివేస్తున్నాయి.. కుటుంబ సభ్యులు బంధువుల ఆరోధనతో కేజీహెచ్ పరిసరాలు అన్నీ కూడా విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.
సింహాచలం ఘటనలో మరో ఇద్దరు యువకులు మృతి
మరోవైపు.. విశాఖ సింహాచలం ఘటనలో మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కోనసీమ జిల్లా కొర్లపాటిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. వీరు వైజాగ్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడి నుండి సింహాచలం చందనోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. అనుకోకుండా ప్రమాదంలో మృతిచెందడంతో యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు మృతి
సింహాచలం ప్రమాదంలో తమ వాళ్ళు చనిపోయారని తెలిసిన వెంటనే కేజీహెచ్ వద్దకు చేరుకొని మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు మృతి చెందడంతో తెలుసుకున్న కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు చేరుకున్నారు.
వర్షానికి గోడ కూలి భక్తులపై పడడంతో అక్కడికక్కడే మృతి
కాగా.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గంలో రిటైనింగ్ వాల్ నిర్మించారు. చందనోత్సవం కావడంతో భక్తుల కోసం ఓ భారీ టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. గాలివాన సమయంలో టెంట్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కదిలిపోయి.. రిటైనింగ్ వాల్‌పై పడిపోయాయి. వర్షం కారణంగా ఆ గోడ అప్పటికే పూర్తిగా నానిపోయి ఉండటం.. అదే సమయంలో స్తంభాలు పడటంతో గోడ కూలింది. పక్కనే ఉన్న భక్తులపై పడటంతో.. కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.
Also Read: సింహాచలం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రమాదం జరిగిన వెంటనే NDRF సిబ్బంది, అధికారులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, సీపీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదంపై చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు తెలిపింది. గాయపడ్డవారికి 3లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు బాధిత కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మోడీ. మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడ్డవారికి 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.