Tirumala News: గోవింద.. గోవిందా అనే నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. ఎందుకంటే తొలి ఏకాదశి కారణంగా ఏడుకొండలలో కొలువైన వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
కలియుగ వైకుంఠం శ్రీనివాసుడికి గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు వెళ్లినా అక్కడ రద్దీగా ఉంటుంది. అదే పండగల రోజు వెళ్తే చెప్పాల్సిన పని లేదు. అమాంతంగా రద్దీ పెరుగుతోంది.వీకెండ్ కావడం ఒకటైతే.. తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి అమాంతంగా పెరిగింది. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
వీఐపీ విరామం సమయంలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, మాజీ ఎంపీ జీవీఎల్ నరిసింహరావు వేర్వేరుగా కుటుంబసభ్యులతో కలసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించార. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఉచిత దర్శనం కోసం తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు బయట క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత శ్రీహరి సర్వ దర్శనానికి వెళ్లే భక్తులకు 16 నుంచి 18 గంటల సమయం పడుతుంది. అది రూ. 300 టికెట్‌కు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అంటున్నారు. క్యూ లైన్‌లో దాదాపు గంట వరకు నడవాల్సి ఉంటుంది.
ALSO READ: తొలి ఏకాదశి స్పెషల్..ఈ రోజు ఆ పని చేస్తే అదృష్టం మీ వెంటే
సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతోంది. వీకెండ్ కావడంతో శనివారం స్వామివారిని దాదాపు 87 వేల మంది పైగానే దర్శించుకున్నారు. 35 వేల భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించారు. శనివారం ఒక్కరోజు స్వామి హుండీ ఆదాయం 3.33 కోట్లు.
ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధికంగా వచ్చినట్టు చెబుతున్నాయి టీటీడీ వర్గాలు. ఎందుకంటే ఈ రోజు స్వామి నాలుగునెలల పాటు నిద్రలోకి జారుకుంటారు. అందుకే ఎక్కువ మంది భక్తులు వచ్చారని అంటున్నారు. ఏకాదశి తర్వాత రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. మళ్లీ కార్తీక మాసం నుంచి రద్దీ యథావిధిగా ఉంటుందని చెబుతున్నారు.