Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద కొనసాగుతుండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు 70 గేట్లు పూర్తిగా ఎత్తి… నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజి నుంచి 4 లక్షల 87వేల 580 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
5 లక్షల క్యూసెక్కుల వరకూ వచ్చే అవకాశం
వర్షాలు ఇలాగే కురిస్తే ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. జి.కొండూరులోని పులివాగుకు వరద పోటెత్తింది. వంతెనకు ఆనుకుని ప్రవహిస్తోంది. కుంటముక్కల వద్ద కొండవాగు, మైలవరం వద్ద మరో కొండవాగు, రెడ్డిగూడెం నుంచి కోతుల వాగుకు వరద పోటెత్తడంతో బుడమేరు ప్రవాహం పెరిగింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 6 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు.
అతలాకుతలం అవుతున్న ప్రజలు
భారీవర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. వర్షాకాలం సమీపించినా కార్పొరేషన అధికారులు డీసిల్టింగ్ చేపట్టకపోవడంతో స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లు పూడుకుపోయాయి. వర్షపు నీరు డ్రెయిన్లలోకి చేరలేదు. అవుట్ ఫాల్ డ్రెయిన్ల నుంచి నగరంలోని ప్రధాన కాల్వలోకి నీరు చేరకపోవడంతో నగరమంతా వర్షపు నీటితో నిండిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం 11 గంటల వరకు నీరు కదల్లేదు. పాత రాజరాజేశ్వరిపేటలో రోడ్లన్నీ మునిగిపోయాయి. వనటౌన, విద్యాధరపురం, కబేళా, కొత్తపేట, చిట్టినగర్, భవానీపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, వించిపేట ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ అడుగులోతున నిండిపోయాయి. గాంధీనగర్, సత్యనారాయణపురం, అయోధ్యనగర్, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. బుడమేరు మధ్యకట్ట వెంబడి విజయదుర్గానగర్‌లో పలు ఇళ్లలోకి నీరు చేరింది. ఈ కాల్వలో తూడు పేరుకుపోవడం వల్ల నీళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. బుడమేరు నుంచి ఏలూరు కాల్వలోకి నీటిని వదిలే గేట్లను తెరవకపోవడంతో ప్రవాహం పెరిగింది. దీంతో అల్లూరి సీతారామరాజు బ్రిడ్జిపై వరద చేరింది. అప్రమత్తమైన ఇరిగేషన అధికారులు గేట్లు తెరిచారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
కుమ్మేస్తున్న వర్షాలతో శ్రీశైలం జలశయానికి పోటెత్తిన వరద కొనసాగుతోంది. జలాశయం 7 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి… దిగువ నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 17 వేల 221 క్యూసెక్కులు ఉండగా… అవుట్ ఫ్లో 2 లక్షల 52 వేల 840 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులకు చేరింది. జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 199.27 టీఎంసీలు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది.
Also Read: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తస్మాత్ జాగ్రత్త..!
సాగర్ ప్రాజెక్ట్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టులోని 26 క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో డ్యామ్ నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు, డ్యాం పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 2లక్షల54వేల784 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 2లక్షల 90,795 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు..ప్రస్తుతం 310.510 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్ గేట్లు ఎత్తటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ప్రవాహం..
మొత్తం 70 గేట్లు ఎత్ దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో 5,20,531 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 5,19,925 క్యూసెక్కులు pic.twitter.com/SWgZmfpCuX
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025