Tuni Women’s College: కాకినాడ జిల్లా తుని మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. సాంబారులో బల్లి పడింది. అతి తెలియక విద్యార్థినులు భోజనం చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స తీసుకుంటున్నారు.
తుని పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఓ జూనియర్ కాలేజీ ఉంది. శనివారం మధ్యాహ్నం తొలి విడత వసతి గృహాల్లో ఉంటున్న 49 మంది విద్యార్థినులు భోజనం చేశారు. సాంబారుతో తిన్న 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా భోజనం చేసిన తర్వాత చివరిలో సాంబరు బల్లి కనిపించడంతో హడలిపోయాడు. ఈ విషయం ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లింది. వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. తుని ఏరియా ఆసుపత్రి వైద్యులు.. విద్యార్థినులకు పరీక్షించారు.
తొలుత నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారికి చికిత్స అందించారు. ఆ తర్వాత బాలికలు వారు ఇళ్లు కొందరు, మరికొందరు వసతి గృహాలకు వెళ్లారు. వసతి గృహాల్లో ఉంటున్న 19 మంది బాలికలకు సాయంత్రం నుంచి కడుపునొప్పి రావడంతో హాస్టల్ సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులు అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బాలికలు అరోగ్యంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలో రాత్రి ఉంచారు. పూర్తిగా కోలుకున్నాక పంపుతామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్వరరావు వెల్లడించారు.
ALSO READ: నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!
ఈ ఘటనతో కళాశాలలో ఆందోళన వాతావరణం నెలకొంది. విద్యార్థులు తినే ఆహారంలో బల్లి ఎలా పడిందనే దానిపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య, అధికారులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కూటమి నేతలు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. భోజనం చేసిన తర్వాత జరిగిన ఇబ్బందులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.