YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. భర్త అనిల్ కుమార్‌తో కలిసి రాహుల్ నివాసానికి వెళ్లిన ఆమె, తమ కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కేవలం కుటుంబ విషయమే కాకుండా, దాదాపు అర్ధగంట పాటు ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై రాహుల్‌తో క్షుణ్ణంగా చర్చించారు.
స్థానిక ఎన్నికల్లో హింసపై ఫిర్యాదు
భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన షర్మిల, ఏపీలో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ముందెన్నడూ లేనంతగా ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే దేశంలోనూ.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అన్ని పార్టీలూ బీజేపీకి తొత్తులే!
రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ దెబ్బతిన్న మాట వాస్తవమేనని, అయితే ఇటీవల స్థానిక ఎన్నికల్లో టీడీపీ తర్వాత అత్యధిక వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి తొత్తులుగా మారాయని లేదా పొత్తులతో పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. విభజన హామీలు నెరవేరకపోవడానికి బీజేపీ, దానితో చేతులు కలిపిన పార్టీలే ప్రధాన కారణమని ఆరోపించారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో షర్మిల భేటీ
ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసినట్లు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. తన బిడ్డ పెళ్లికి రాహుల్ గాంధీని ఆహ్వానించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన… pic.twitter.com/BQt6tFN5Sy
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2026
చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు కూడా ఆహ్వానం
రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, కుమార్తె వివాహం తమ కుటుంబంలో శుభకార్యమని షర్మిల తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను కూడా వ్యక్తిగతంగా కలిపి పెళ్లికి ఆహ్వానిస్తానని ఆమె స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!