AP Govt: ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా పలు శుభవార్తలు చెప్పిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పింది. దీనితో సుమారు 45 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు చూస్తున్న ఆ ఉద్యోగుల కలను ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పవచ్చు.
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఆశా వర్కర్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విపత్కర కాలంలో సైతం వీరి సేవలు ప్రజల మన్ననలు పొందాయి. తమ క్లస్టర్ పరిధిలోని గర్భిణీ మహిళలకు వైద్య సేవలు అందించడం, మెరుగని వైద్య చికిత్స కోసం వైద్యశాలకు తరలించడం, పల్స్ పోలియో వంటి కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోషించడం, ఇలా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వీరి సేవలు ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి. అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు ఆశా వర్కర్లు ఏపీలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి.
ఏపీలో ఎన్నికలకు ముందు సైతం ఆశా వర్కర్లు అన్ని జిల్లాలలో నిరసనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆశా వర్కర్లను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది.
ఏపీలో సుమారుగా 42,752 మంది ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. వీరికి గతంలో 60 ఏళ్లకు పదవీ విరమణ కాలం ఉండేది. ప్రస్తుతం 62 ఏళ్ళకు పెంచుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వీరి గ్రాట్యూటీ చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో ఒక్కొక్క ఆశా కార్యకర్తకు లక్షన్నర మేర లబ్ధి చేకూరనుంది. జీతంతో పాటు 180 రోజుల మెటర్నటీ లీవ్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా డిమాండ్స్ వినిపిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల కాలంలో తమ సమస్యలపై దృష్టి సారించడం హర్షించదగ్గ విషయమని వారు తెలుపుతున్నారు. అలాగే ఏపీ బడ్జెట్ లో వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,264 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే గతంలో రూ. 6400 కోట్లు బకాయిలు ఉండగా, రూ. 1624 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పేర్కొంది.
Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి యాక్సిడెంట్… గాయాలు కూడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆశా కార్యకర్తలకు భరోసా నిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే సూపర్ సిక్స్ అమలుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించిందని ప్రభుత్వ ఉద్యోగులు తెలుపుతున్నారు.