Vizag: విశాఖలో అడుగు పెట్టనుంది గూగుల్. ఈ సంస్థ సుమారు 50 వేల కోట్ల పెట్టుబడితో.. 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతి పెద్ద కేంద్రానికి వైజాగ్ వేదిక కానుంది.
ఇన్వెస్ట్ ఇండియా- ఎక్స్ పోస్ట్ ద్వారా విషయం వెలుగులోకి
గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా-ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్ ప్రతిపాదన ఒక గేమ్ ఛేంజర్ కానుందని.. ప్రపంచానికి డిజిటల్ హబ్ గా దేశానికే ఒక గుర్తింపు రానుందనీ రాసుకొచ్చిందీ సంస్థ. దీంతో అందరి దృష్టి ఏపీపై పడింది. గూగుల్ క్లౌడ్,సెర్చ్, యూట్యూబ్, ఏఐ వర్క్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ని బలోపేతం చేసేలా ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది. పరిశ్రమలు, స్టార్టప్ లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇక డేటా చౌర్యం అనే భయం ఉండదంటోన్న ఐటీ ఎక్స్ పర్ట్స్
విశాఖలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లో.. ఈ దేశానికి చెందిన డేటా మొత్తం ఇక్కడే నిల్వ కానుంది. ఇందువల్ల డేటా చౌర్యం అనే భయం ఇక ఉండదని అంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ బ్యాండ్ విడ్త్ ను పెంచేందుకు 3 సబ్ మెరైన్ కేబుల్స్ కి సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా డేటా సెంటర్ ను అనుసంధానించనున్నారు. ఈ డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున నీరు అవసరం. అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
గూగుల్ డేటా సెంటర్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
ఐటీ రంగంలో 2 కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని ఒక అంచనా. ఈ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.
Also Read: తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి
కేవలం కరెంటు కోసమే 20 వేల కోట్లు ఖర్చు చేయనున్న గూగుల్
డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ ను వాడుకోవాలని నిర్ణయించింది గూగుల్. డేటా సెంటర్ కూలింగ్ నిర్వహణకు కరెంటు ఎంతో అవసరం. ఈ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే విద్యుత్ ని గూగుల్ వాడుకోనున్నట్టు తెలుస్తోంది.