Amarnath on Lokesh: వైసీపీ తన ఉనికి చాటుకునే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రేపో మాపో విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఈ టూర్‌లో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అవన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది ఫ్యాన్ పార్టీ. ఈ క్రమంలో మాజీ గుడివాడ అమర్నాథ్ నోరు విప్పారు.
విశాఖలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్‌పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి. వైసీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులపై కూటమి హడావుడి చేస్తోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ శంకు స్థాపన చేసే ప్రాజెక్టులన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని అన్నారు అమర్నాథ్. జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నా రని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జగన్ మీద మాట్లాడి మంత్రి లోకేష్ అభాసు పాలయ్యారు. ఆయనకు ఏ శాఖ మీద అవగాహన లేదని, చివరకు సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఉత్తరాంధ్రకు ఏమి చేశారో చెబితే బాగుండేదన్నారు మాజీ మంత్రి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. శ్రీకుకుళం జిల్లాలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్ నిర్మాణం మీకు కనిపించలేదా? అంటూ ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయని అన్నారు.
ALSO READ: ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?
మా ప్రభుత్వం తెచ్చిన టీసీఎస్ మీరు తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని, విశాఖలో ఐటి రావడానికి కారణం వైఎస్ కుటుంబం కాదా అంటూ ధ్వజమెత్తారు. రుషికొండపై అద్భుతమైన భవనం జగన్ కట్టారని, దాన్ని ప్రధాని, రాష్ట్రపతి అవసరాల కోసం వాడవచ్చని సలహా ఇచ్చేశారు. ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏమి చేసిందని మండిపడ్డారు.
వరదలు, విపత్తులు వచ్చినా అందుకు జగన్‌నే కారణం అంటున్నారని గుర్తు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం జరిగిందన్నారు. 1300 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పకనే చెప్పారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది అప్పటి ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
17 రాష్ట్రాలు పోటీ పడినా దక్షిణ భారత్‌కు బల్క్ డ్రగ్ పార్క్ సాధించామని వివరించారు. రైల్వే జోన్‌కు 52 ఎకరాల భూములు జనవరి నెలలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. టీడీపీ హయాంలో బకాయిలు పెట్టిన రూ. 50 వేల కోట్లను జగన్ చెల్లించారని, మీరు అప్పు తెచ్చిన లక్షా 20 వేల కోట్లు ఏమి చేశారని ప్రశ్నించారు. గంజాయి రవాణా చేసే ఖైదీలు సెంటర్ జైల్లో ఆ మొక్కలు పెంచుతున్నారని మరొక ఆరోపణ చేశారు.