BigTV English

HAL Row: ఏపీ వర్సెస్ కర్నాటక.. HAL వివాదానికి కారణం ఎవరు..?

HAL Row: ఏపీ వర్సెస్ కర్నాటక.. HAL వివాదానికి కారణం ఎవరు..?

హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్- HAL. బెంగళూరులో ఉన్న ఈ కంపెనీ విషయంలో ఏపీ, కర్నాటక ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. HAL ని ఏపీకి తరలించుకు పోవాలని చూస్తున్నారని, అదే జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని కర్నాటక కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే HAL ని తరలించాలనే ఉద్దేశం తమకు లేదని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న సంస్థలను తన రాష్ట్రానికి తరలించాలనే ఉద్దేశం తనకు లేదని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని, ఆ చెడ్డపేరు తనకు వద్దని వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఇంత చెప్పినా కూడా కర్నాటక నుంచి కౌంటర్లు ఆగలేదు.


HAL ఘన చరిత్ర..
హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్-HAL కంపెనీని స్వాతంత్రానికి పూర్వమే, అంటే 1940లో బెంగళూరులో ఏర్పాటు చేశారు. మొదట్లో మైసూర్ మహారాజాకు కూడా ఆ కంపెనీలో వాటాలుండేవి. ఆ తర్వాత దాన్ని జాతీయం చేశారు. ప్రస్తుతం పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉన్న HAL స్వదేశీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణా విమానాల తయారీకి ప్రసిద్ధి. అలాంటి HAL కంపెనీని ఆంధ్రప్రదేశ్ కి తరలించడం సాధ్యమేనా..? కానీ దీనిపై ఒక్కసారిగా పుకార్లు గుప్పుమన్నాయి. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ ని కలసి దీనిపైనే చర్చించారనే వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు నుంచి HAL ని ఏపీకి తరలిస్తున్నారంటూ కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం భగ్గుమంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తమ రాష్ట్రంలోని కంపెనీని తరలించడానికి ఎంత ధైర్యం అంటూ కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ కంపెనీని కోరడానికి చంద్రబాబు సాహసం చేయడమేంటని విమర్శలు మొదలు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలు పెట్టారు.

చంద్రబాబు అడిగిందేంటి..?
బెంగళూరులోని HALను ఏపీకి తరలించాలని తాను కేంద్రాన్ని అడగలేదని వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మహానాడు వేదికగా కర్నాటక చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఓ ప్రాంతంలో ఉన్న సంస్థను మరో ప్రాంతానికి తరలించాలని తానెప్పుడూ కోరను అని అన్నారు. తన చరిత్రలో అలాంటిది లేదన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను తరలించమని చెప్పి కోరి చెడ్డ పేరు తెచ్చుకోను అని కూడా అన్నారు చంద్రబాబు. రక్షణ మంత్రిని తాను ఏం అడిగాను అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. రక్షణ రంగానికి అవసరమైన సామగ్రి తయారీకి ఏపీని హబ్ గా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, దానికి అవసరమైన వ్యూహాత్మక ప్రణాళిక గురించి మాత్రమే రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడానని చెప్పారు.


లేపాక్షి కేంద్రంగా..
అనంతపురం జిల్లాలోని లేపాక్షి ప్రాంతం.. విమానాల తయారీకి, రక్షణరంగానికి సంబంధిత పరిశ్రమలను స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు చంద్రబాబు. గతంలో కూడా తాను లేపాక్షి సామర్థ్యాన్ని కేంద్రానికి తెలిపానని చెప్పారు. అయితే HAL విస్తరణ ప్రణాళికల కోసం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో 10వేల ఎకరాల భూమికి సంబంధించి కేంద్రానికి చంద్రబాబు ఒక నివేదిక ఇచ్చినట్టు ఓ ఉన్నతాధికారి లీక్ చేసిన సమాచారంతో గొడవ మొదలైంది. చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాన్ని కర్నాటక తప్పుగా అర్థం చేసుకుందని అంటున్నారు. తాను అడిగింది HAL తరలింపు కాదని, రాయలసీమకు రక్షణ రంగ పరిశ్రమల గురించి మాత్రమేనని వివరణ ఇచ్చారు. మరి ఇప్పటికైనా కర్నాటక నేతలు శాంతిస్తారా..? లేక రాజకీయ ప్రయోజనాలకోసం దీన్ని మరింత పెద్దదిగా మారుస్తారా..? వేచి చూడాలి. ఒకవేళ HAL విస్తరణను ఏపీలో చేపట్టేందుకు కేంద్రం అంగీకరించినా, కర్నాటక నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×