Political Capital of AP : ఇప్పుడు ఏపీ రాజకీయాలు విశాఖ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ కార్యక్రమాలను నగరంలో చేపడుతున్నాయి. పాలనా వికేంద్రీకరణ నినాదంతో వైఎస్ఆర్ సీపీ గర్జన నిర్వహించింది. ఆ కార్యక్రమానికి వచ్చి వెళుతున్న సమయంలో మంత్రులపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద దాడి జరిగింది. ఈ కేసులో కొంతమంది జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్ జనవాణి కార్యక్రమం చేపట్టడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పవన్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ ఎపిసోడ్ తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజయవాడలో భేటీకావడంపై పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చ జరిగింది.
ఇప్పుడు టీడీపీ కూడా విశాఖ వేదికగా పోరుబాట చేపట్టింది. రుషికొండ పరిరక్షణ పేరుతో ఆ పార్టీ నేతల ఆందోళనకు ప్రయత్నించగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. విశాఖలో సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు , దసపల్లా భూములు, పేదల స్థలాల ఆక్రమణలపై టీడీపీ నేతలు ఆరు చోట్ల ఆందోళన ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఉత్తరాంధ్రలోని ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పళ్ల శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. విశాఖ వెళుతుండగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్, నిమ్మక జయకృష్ణను తగరపు వలస వద్ద అడ్డుకుని భీమిలి పోలీసు స్టేషన్ కు తరలించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను అరెస్ట్ చేశారు. రుషికొండకు వెళ్లే మార్గంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆంక్షలతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్లు వాహనాలను నిలిపి వేయడంతో లగేజీ మోసుకుని వెళ్లాల్సిన దుస్థితి సామాన్యులకు ఎదురైంది.
విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అటు టీడీపీ, జనసేన ఉత్తరాంధ్ర పరిరక్షణ నినాదం అందుకున్నాయి. పాలనా రాజధాని మాట దేవుడెరుగు కానీ……విశాఖ మాత్రం ఏపీ పొలిటికల్ కేపిటల్ గా మారిపోయింది. నిత్యం ఏదో ఒక రాజకీయ కార్యక్రమం పేరుతో పార్టీలు హడావిడి చేయడంతో సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.