Heavy Rains to AP: వాతావరణ శాఖ ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి కోతలు కోసే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
అసలే చలికి గజగజలాడుతున్న ఏపీకి వాతావరణ కేంద్ర మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 23, 24 తేదీల్లో పశ్చిమ వాయువ్యదిశగా పయనించి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: మరో గుడ్ న్యూస్.. ఏపీలో ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు
చలి పంజా కూడా..
ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు కప్పేస్తుంది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ష సూచన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓ వైపు చలి, మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.