AP Rains: ఏపీలో మూడు రోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శనివారం చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సముద్రపు తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారిందంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి పల్నాడు జిల్లా వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..
అయితే మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం ఈ వాడ రేవులకు ఇప్పటికే మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే తీరం వెంబడి దాదాపుగా 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదలతో కూడా సంభవించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
Also Read: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కిటకిటలాడుతున్న దేవాలయాలు..
మరో మూడు రోజులు జాగ్రత్త..
ముఖ్యంగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే మత్స్యకారులను మరో ఐదు రోజులు వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపోతున్న ప్రాంతాల్లో, ఘాట్ రోడ్ల దగ్గర ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.