Godavari Floods: ఆగస్టు 31.. విజయవాడ వాసులు కలలో కూడా మరచిపోలేని రోజు. బెజవాడ వాసుల తలరాతల్ని మార్చేసిన రోజు. అంత వరద చుట్టుముడుతుందని పాపం.. కలనైనా కని ఉండరు. భారీ వర్షానికి జలమయమైన రోడ్లు, మరోవైపు కట్ట తెంచుకున్న బుడమేరు.. ఫలితంగా ప్రధాన రహదారులు మినహా.. బుడమేరు పరిసరాల్లో ఉన్న కాలనీలన్నీ నీటమునిగాయి. 15 అడుగుల మేర వరకూ నీరు చేరగా.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కానీ.. సరిపడా ఆహారం, నీరు, పిల్లలకు పాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అక్కడి పరిస్థితులు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.
ఆహారపొట్లాలు, నీటి బాటిళ్లకోసం బురదలోనూ ఎగబడుతున్నారంటే.. ఎంత ఆకలితో ఉన్నారో కదా పాపం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దుర్గగుడితో పాటు.. మరికొన్ని ఆలయాల్లో ఆహారాన్ని వండి పంపిణీ చేస్తున్నా.. ఇంకా సరిగ్గా ఆహారం దొరకక ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. విజయవాడకు వరద మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకోకుండానే.. మళ్లీ పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కృష్ణమ్మ శాంతిస్తే.. అక్కడ గోదావరి ఎరుపెక్కుతోంది. వర్షపునీటితో పాటు.. ఎగువ నుంచి వచ్చే వరదనీటితో ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. ఫలితంగా రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంబాల చెరువు, శ్యామల సెంటర్ నీటమునిగినా అధికారులు ఇంతవరకూ పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కృష్ణమ్మ నుంచి బెజవాడను రక్షించిన ఆ వాల్ ను కట్టింది చంద్రబాబేనా ? జగనా ? అసలు నిజం ఏంటి ?
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరి నదికి వరద పోటెత్తింది. సమీపంలో ఉన్న ముంపు ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాగునీరు ప్రధాన రహదారులపైకి చేరడంతో.. ఏ క్షణానైనా గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. సోకిలేరు వాగు చూటూరు రహదారిని ముంచెత్తగా.. నలుగురు ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలకు దిగారు.
అటు భద్రాచలం వద్ద కూడా గోదావరి నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం నదినీటిమట్టం 42.6 అడుగులకు చేరగా.. 43 అడుగులకు చేరగానే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చగా.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.