Vijayasai Reddy Daughter: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నేహా రెడ్డికి రూ.17 కోట్ల జరిమానా విధించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి విశాఖ బీచ్ సమీపంలో సీఆర్జెడ్ (Coastal Regulation Zone) నియమాలను అతిక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు హైకోర్టు తేల్చింది. సముద్రతీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిర్మాణాలు పర్యావరణానికి హానికరంగా ఉన్నట్టు అధికార నివేదికల ద్వారా స్పష్టమైంది. దీంతో హైకోర్టు ఆమెపై రూ.17 కోట్ల జరిమానా విధించింది. ఈ నిర్మాణాలపై పిటిషన్ దాఖలవ్వడంతో హైకోర్టు విచారణ చేపట్టి, పర్యావరణ శాఖ నివేదికల ఆధారంగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేల్చింది. దీంతో నేహా రెడ్డిపై రోజుకు ₹1.2 లక్షల చొప్పున అంటే 1455 రోజులకుగాను మొత్తం రూ.17 కోట్ల జరిమానా విధించింది.
సాధారణంగా బీచ్ పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, కాటేజ్‌లు, కమర్షియల్ యాక్టివిటీలకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట నిబంధనలు అమలు చేసింది. ఈ నియమాలు ప్రకృతిని పరిరక్షించడానికే రూపొందించబడ్డాయి. అయితే నేహా రెడ్డి నిర్వహించిన సంస్థ ఈ నిబంధనలను పూర్తిగా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టిందని పర్యావరణ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో తవ్విన భూమిని పునరుద్ధరించకపోతే జరిమానా రెట్టింపు అవుతుందని కోర్టు హెచ్చరించింది.
రాజకీయంగా దుమారం..
ఈ తీర్పుతో పాటు, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. విశాఖబీచ్ ప్రాంతం పర్యాటకంగా మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకూ కీలకమైన ప్రాంతం. ఇలాంటి ప్రదేశాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది. కోర్టు తీర్పు ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా కావొచ్చు – రాజకీయ నాయకుడి కుమార్తె అయినా, పెద్ద స్థాయి పారిశ్రామికవేత్త అయినా – చట్టం ముందు సమానమే. ఈ తీర్పు వల్ల రాజకీయంగా దుమారం రేగుతోంది. ఒక వైపు వైసీపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, మరోవైపు కోర్టు తీర్పుపై పర్యావరణ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వేదికగా, ప్రకృతి పరిరక్షణకు ఇది గొప్ప ముందడుగు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తిపై విధించిన జరిమానా మాత్రమే కాదు. పర్యావరణాన్ని నిర్వాకం చేయాలనుకునే ప్రతివారికి ఇది ఓ గట్టి హెచ్చరిక. ప్రకృతి మనకిచ్చిన వరం. దాన్ని ధ్వంసం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. కోర్టు తీర్పు ప్రజల ఆశలను నిలబెట్టింది.