
Rajini: సీఎం జగన్ పాలనలో హైకోర్టు మెట్లు ఎక్కేవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో సీఎస్, డీజీపీతో సహా.. పలువురు ఉన్నతాధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడ్డారు. కొందరికి శిక్షలు కూడా పడ్డాయి. ఆ తర్వాత క్షమాపణలూ వచ్చాయి. తాజాగా, జగన్ కేబినెట్ లోని మంత్రి విడదల రజినీకి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇచ్చారనే అంశంలో మంత్రి రజినీకి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. మంత్రి విడదల రజినీకి నోటీసులు జారీ చేసింది.
మంత్రి రజినీ మాత్రమే కాదు.. ఇదే కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. స్థానిక తహసీల్దార్‌కు సైతం నోటీసులు అందాయి. గ్రానైట్ తవ్వకాల వ్యవహారంలో అసలేం జరిగిందో తెలపాలంటూ ఆ ముగ్గురికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.
గ్రానైట్ తవ్వకాలపై టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. వైసీపీ పాలనలో అంతా అవినీతిమయం అని, ఖనిజ సంపదను ఇష్టారాజ్యంగా దోచుకుంటోందని ఎప్పటినుంచో విమర్శలు చేస్తోంది. దేవినేని ఉమా, పట్టాభి లాంటి వారు గతంలో అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. అప్పుడు అధికార పార్టీ వారిపై ఎదురుదాడి చేసింది. అంతా సవ్యంగానే సాగుతోందని చెప్పింది.
అయితే, ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో అసైన్డ్ భూమిలో గ్రానైట్ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ పై మంత్రి విడదల రజినీతో పాటు ఎంపీ అవినాశ్ మామ ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నోటీసులు అందడంతో టీడీపీ తమ విమర్శలకు మరింత పదును పెంచింది.