YCP vs TDP In Tuni: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. అయితే మున్సిపాలిటీపై పట్టుకోల్పోకుండా ఉండాలని వైసీపీ భావిస్తోంది. ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇంకా అనేక మంది సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారు. వైసీపీ తమ కౌన్సిలర్లు జారిపోకుండా మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం బస్సును కూడా సిద్ధం చేసింది. ఇటు టీడీపీ కూడా వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
దీంతో కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక వాయిదా పడగా, ఇవాళ నాలుగోసారి ఎన్నికకు సిద్ధమయ్యారు అధికారులు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐతే వైసీపీ చలో తునికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ ముఖ్యనేతల కదలికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జక్కంపూడి గణేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. తుని బయల్దేరేందుకు సిద్ధమైన ఆయన్ని రాజమండ్రిలోనే అడ్డుకున్నారు. లాఠీఛార్జ్‌లు, తోపులాటలతో పరిస్థితి గందరగోళంగా మారింది. తుని మున్సిపల్ కార్యాలయం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది.
మరోవైపు వైసీపీ చలో తునికి పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కార్యాలయాన్ని అష్టదిగ్భందం చేశారు. 200 మీటర్ల దూరం వరకు షాపులన్నీ మూసివేశారు. దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో.. స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు పోలీసులు.
ఇటు తుని రూరల్ పీస్ దగ్గర ముద్రగడ పద్మనాభంను అడ్డుకున్నారు పోలీసులు. తునిలో ఎవరికీ అనుమతి లేదంటూ బైపాస్ వద్దే కాన్వాయ్‌ని నిలిపివేశారు. ముద్రగడకు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించారు. ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఉద్రిక్తత వాతావరణంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక వాయిదా పడగా, ఇవాళ నాలుగోసారి ఎన్నికకు సిద్ధమయ్యారు అధికారులు.
Also Read: బలనిరూపణా? ఆవిర్భావమా? పవన్ ప్లాన్ ఏంటి?
మున్సిపల్ ఎన్నికల విషయంలో టీడీపీ అనుసరిస్తున్న విధానంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ తీరుకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో ఛలో తుని కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంపై YCP MLC అప్పిరెడ్డి నేతృత్వంలో సోమవారం నాడు ఈసీని కలిసిన వైసీపీ నేతలు టీడీపీపై ఫిర్యాదు చేశారు. ఒక్క సభ్యుడు కూడా లేనిచోట్ల టీడీపీ నేతలు ఎలా పోటీ చేసి గెలుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో అక్రమ మార్గాల్లో గెలవాలని చూస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.
మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపితే చాలు.. వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ సొంతమవుతుంది. ఏదేమైనా ఈ ఎన్నిక విషయంలో ఉదయం నుంచి హైడ్రామా నడుస్తుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అనే రేంజ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది.