Case on Pastor Shalem Raj: పూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ సాలెం రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలోని SV యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో హిందూ చైతన్య వేదిక తరఫున ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సోమవారం లోపు అతన్ని అరెస్ట్ చేయకపోతే హిందూ సంఘాలన్నీ కలిసి తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలేం రాజు, తన ప్రార్థనా సభల్లో మహిళలపై చేసిన వ్యాఖ్యల కారణంగా.. ఆయన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే మహిళలను “బజారు మహిళలు”గా అభివర్ణించిన ఆయన వ్యాఖ్యలు.. హిందూ మత విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని, పలువురు మహిళలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
“మల్లెపూలు పెట్టుకునేది బజారు మహిళలే” అని ఆయన చేసిన వ్యాఖ్యలు, హిందూ సంస్కృతిలో మల్లెపూలకు ఉన్న పవిత్రతను, గౌరవాన్ని అవమానకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్టర్ చేసిన వ్యాఖ్యలు సాంప్రదాయ విలువలను, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, షాలేం రాజు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ.. పెద్ద ఎత్తున మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వివాదం స్థానికంగా మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ సంస్కృతిలో మల్లెపూలు పవిత్రతకు, సాంప్రదాయానికి చిహ్నంగా ఉంటాయి. మహిళలు వాటిని ధరించడం సామాజికంగా గౌరవప్రదమైన ఆచారం. షాలేం రాజు వ్యాఖ్యలు ఈ సాంస్కృతిక విలువలను అవమానించారని.. పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: రాజకీయాల్లోనూ పుష్ప దే రూల్.. జగన్ వ్యూహం ఇదేనా? ఆ కార్యకర్త ఏ పార్టీ వాడంటే?
షాలేం రాజు పనిగట్టుకుని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఎలా మాట్లాడుతారు? అసలు మతాన్ని పక్కన పెడితే మహిళల్ని ఇంత దారుణంగా విమర్శిస్తారా? మల్లెపూలు మహిళలు పెట్టుకుంటే వాళ్లు బజారు మనుషులు అవుతారా? వాళ్లు రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరుగుతారా? పాస్టర్ గారు ఏంటిది? మీలో అసలు విచక్షణ ఉందా? అంటూ మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది మహిళలకు జరిగిన ఘోరాతి ఘోరమైన అవమానం. వెంటనే మీడియా ముందుకు వచ్చి.. నేను చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు.. నన్ను క్షమించండి అని.. రెండు చేతులు జోడించి మహిళలందరికీ షాలేం రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ.. పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక పద్దతి ప్రకారం.. వ్యూహంలో భాగంగానే, ఒక వర్గం మెప్పుకోసం.. మిగతా మతాలను పూర్తిగా కించపరిచేలా మట్లాడారని.. పెద్దఎత్తున దుమారం రేపుతోంది.