Obulapuram mining case verdict: ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురికి శిక్షలు ఖరారు చేసింది. మరో ఇద్దర్ని నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు క్లీన్‌చిట్ ఇచ్చింది.
ఏ-1 శ్రీనివాసరెడ్డి, ఏ-2 గాలి జనార్థన్ రెడ్డి, ఏ-3 రాజగోపాల్‌రెడ్డి, ఏ-7 జనార్థన్‌రెడ్డి పీఏ అలీఖాన్‌లకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. నా వయస్సు, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గించాలని న్యాయమూర్తి ముందు తన గోడు వెల్లబోసుకున్నాడు గాలి జనార్థన్‌రెడ్డి. అందుకు న్యాయమూర్తి ససేమిరా అన్నారు. యావజ్జీవ శిక్షకు మీరు అర్హులని న్యాయమూర్తి ప్రస్తావించారు. అనంతరం నిందితులను జైలుకి తరలించారు.
అసలు కేసు ఏంటి?
అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. దాదాపు 14 ఏళ్లుపాటు ఈ కేసు దర్యాప్తు, విచారణ సాగింది. 219 మంది సాక్షులు, 337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది సీబీఐ కోర్టు. 2009 లో ఓఎంసీ అక్రమ మైనింగ్‌పై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీబీఐని దర్యాప్తుకు ఆదేశించింది కేంద్రం.
2011లో తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది సీబీఐ. అదే ఏడాది సెప్టెంబర్ 4న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితులుగా చేర్చింది. నాలుగు ఛార్జిషీటుల్లో 9 మందిని నిందితులుగా ప్రస్తావించింది సీబీఐ. 884 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపింది. ఈ కేసు వ్యవహారం ఉమ్మడి ఏపీలో తీవ్ర ప్రకంపనలు రేపింది.
సబిత, మాజీ ఐఏఎస్ కృపానందంలకు క్లీన్‌చిట్
ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది సీబీఐ. వారిలో గాలి జనార్దన్‌రెడ్డి, గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, సబితా ఇంద్రారెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.
ALSO READ: ఆసుపత్రిలో ఎమ్మెల్యే సుజనాచౌదరి.. డాక్టర్లు ఏమన్నారు?
ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు, మే 10లోగా తీర్పు వెల్లడించాలని సీబీఐ కోర్టుని ఆదేశించింది. ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి వాదోప వాదనలు జరిగాయి. విచారణ సమయంలో లింగారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మూడేళ్ల కిందట ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్ఛార్జి చేసింది హైకోర్టు.
మిగిలిన ఏడుగురు నిందితులకు సంబంధించి తీర్పు వెల్లడించింది సీబీఐ న్యాయస్థానం. ఐదుగుర్ని దోషులుగా తేల్చింది. ఇద్దర్ని నిర్థోషులుగా నిర్ధారించింది. అయితే దోషులుగా తేలినవారికి శిక్షలు ఖరారు చేయాల్సివుంది. శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించేందుకు దోషులు సిద్దమవుతున్నట్లు సమాచారం.