OMC Case: సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కష్టాలు పొంచి ఉన్నాయా? ఓబులాపురం మైనింగ్ కేసు ఆమెను ఇంకా వెంటాడుతోందా? హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టిసి నట్టేనా? మూడు నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఎందుకు ఆదేశించింది? ఈసారి ఆమె ఇరుక్కోవడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఓబులాపురం మైనింగ్ కేసులో మంగళవారం హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా తేల్చింది. ఏడేళ్లు శిక్ష ఖరారు చేసింది. న్యాయస్థానం తీర్పు తర్వాత నిందితులు జైలుకి వెళ్లారు. మంగళవారం నాటి తీర్పుతో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రం కాసింత ఉపశమనం కలిగింది.
ఈ కేసులో మూడేళ్ల కిందట ఆమెని డిశ్చార్జ్ చేసింది హైకోర్టు. అయితే ఆమె డిశ్చార్జి పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది సీబీఐ. చివరకు సీబీఐ వాదనలో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది.
అసలు కేసు ఏంటి?
మూడు నెలల్లో మరోసారి విచారణ చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో షాకయ్యారు ఐఏఎస్ శ్రీలక్ష్మి. కర్ణాటక-ఏపీ సరిహద్దు జిల్లా అనంతపురంలో ఐరన్ ఓర్‌ను ఇష్టానుసారంగా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసుకున్నారన్న ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సీబీఐతో విచారణ చేపట్టారు. రాష్ట్ర సరిహద్దులను సైతం చెరిపేశారంటూ కేసులు నమోదు చేసింది.
ALSO READ: రిపోర్టర్స్ ప్రశ్నలకు సేనాని దిమ్మతిరిగే కౌంటర్
2009లో అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ టీమ లోతుగా దర్యాప్తు చేపట్టింది. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డిని అరెస్టు చేసి బళ్లారి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దాదాపు రెండేళ్లకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై గాలి విడుదలయ్యారు.
గనుల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సీబీఐ కోర్టు తీర్పుతో ఈ కేసు నుంచి ఆమె బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంను నిర్దోషిగా పేర్కొంది.ఈ కేసులో మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలో హైకోర్టు డిశ్చార్జ్ చేసింది.
ఇంకా లోతుల్లోకి వెళ్తే..
అప్పటి కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి-బీవీ శ్రీనివాసరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 95 హెక్టార్ల ఇనుప ఖనిజం గనులను కేటాయించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2007 జూన్ 18న అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో 2009 డిసెంబరు 7న అప్పటి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఈ వ్యవహారం తేల్చాలని కేంద్రం సీబీఐకి అప్పగించింది. అవినీతి నిరోధక చట్టం, అటవీ, గనులు-ఖనిజాల చట్టాల కింద కేసు నమోదు చేసింది సీబీఐ. లీజుల కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డిలకు అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శులు కృపానందం, శ్రీలక్ష్మి, డైరెక్టర్ రాజగోపాల్, లింగారెడ్డి సహకరించినట్లు సీబీఐ ప్రధానంగా ఆరోపించింది.
రెండేళ్ల దర్యాప్తు తర్వాత 2011 డిసెంబరులో సీబీఐ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2012 మార్చిలో శ్రీలక్షి, 2013లో అలీఖాన్‌పై అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను మొదటి ఛార్జిషీట్‌లో సాక్షులుగా పేర్కొంది సీబీఐ. వారిద్దరూ నిందితులేనని ప్రస్తావిస్తూ 2014లో ఏప్రిల్‌లో తుది ఛార్జిషీట్ వేసిన విషయం తెల్సిందే.