Tirumala News: ఎండాకాలం ముగిసినా తిరుమలలో రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఆషాఢ మాసం వచ్చినా ఏ మాత్రం తగ్గలేదు. ఫలితంగా ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి వున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 18 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో ఏడుకొండల శ్రీనివాసుడ్ని దర్శించుకోవడానికి భక్తులు పోటీపడతారు. సమస్యల నుంచి బయటపడటానికి వెళ్లేవారు కొందరైతే, చేసిన పాపాలు పొగొట్టుకునేందుకు మరికొందరు వెళ్తుంటారు. నార్మల్‌గా ఎండాకాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, కాలేజీలకు సెలవు రావడంతో ఫ్యామిలీలతో తిరుమలకు వెళ్తుంటారు.
ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చింది. అయినా తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి వున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ఉదయం 8 గంటల తర్వాత సర్వ దర్శనానికి వెళ్లే భక్తులకు దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
అదే 300 రూపాయల శీఘ్రదర్శనానికి మూడు లేదా నాలుగు గంటలు సమయం పడుతుంది. ఈ దర్శనానికి వెళ్తే భక్తులు కంపార్టుమెంట్ దగ్గరకు వెళ్లేసరికి దాదాపు గంట సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులకు సమయం బాగానే పడుతోందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ఏపీ వైపు పారిశ్రామిక వేత్తల చూపు, రేపో మాపో శంకుస్థాపనలు
గురువారం స్వామిని దాదాపు 65 వేల మంది దర్శించుకున్నారు. స్వామివారికి తల నీలాలు సమర్పించినవారు దాదాపు 24 వేల మంది. గురువారం ఒక్కరోజు హుండీ ఆదాయం 4 కోట్ల పైగానే దాటింది. తిరుమల వచ్చే భక్తులకు సర్వదర్శనం టోకెన్లను ప్రతీ రోజు 8 వేల నుంచి 15 వేల వరకు కేటాయిస్తారు. మూడు ప్రాంతాల్లో ఆయా టోకెన్లను జారీ చేశారు.
వాటిలో అలిపిరి సమీపంలో భుదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీనివాస కాంప్లెక్స్, మూడోది రైల్వేస్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఆయా టోకెన్లను ఇవ్వనున్నారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు వాటిని జారీ చేస్తారు. ఈ టోకెన్లు మరుసటి రోజు దర్శనానికి వర్తిస్తాయి.
ఈ టోకెన్ తీసుకున్న భక్తులు, కచ్చితంగా శ్రీవారి 1200 మెట్టు వద్ద టోకెన్లు స్కాన్ చేయించుకోవాలి. సర్వ దర్శనం టోకెన్ల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వరాదని, టోకెన్లు ఇప్పిస్తామని మభ్య పెట్టే మోసగాళ్ల వలలో పడవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని టీటీడీ చెబుతోంది. ఈ టోకెన్లకు ఆధార్ కార్డు ఉండాలి. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.