Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలోపడ్డాయి. ఈ జాబితాలో రిలయన్స్, పతంజలి సంస్థలు ముందు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రెండు కంపెనీలు భూములు పరిశీలించే పనిలోపడ్డాయి. అంతా అనుకున్నట్లు జరిగితే శ్రావణమాసంలో శంకుస్థాపనలు జరగడం ఖాయమని అంటున్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడుదారులను ఆకర్షిస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో భారీ ఫుడ్ & బివరేజ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ విషయాన్ని రిలయన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీలో రూ.1622 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపింది.
జూన్ 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి-SIPB సమావేశంలో ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. శీతల పానీయాలు, పండ్ల రసాలు, ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించిన పరిశ్రమను రిలయన్స్ నెల కొల్పనుంది. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు ప్రాంతంలో ఈ ప్రాజెక్టు రానుంది. ఏపీ ఐఐసీ ల్యాండ్ బ్యాంకులోని 80 ఎకరాల భూమిని కేటాయించింది.
ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించింది ప్రభుత్వం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద పన్ను మినహాయింపులు, విద్యుత్ రాయితీలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహకాలు ఇవ్వనుంది ప్రభుత్వం. సుమారు 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా ట్రాన్స్‌పోర్ట్, ప్యాకేజింగ్, ఫర్మింగ్ తదితర రంగాల్లో మరెన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరినాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమ సర్కార్.
ALSO READ: బయటకు వస్తే ఏపీ ఖతం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
మరోవైపు విజయనగరం జిల్లాలో వందల కోట్లతో పతంజలి పరిశ్రమ రానుంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ జిల్లాలో పర్యటించి పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా బాబా రాందేవ్ వివరించారు. భారీ స్థాయిలో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన. సీఎం చంద్రబాబు విజనరీ లీడరంటూ ప్రశంసించారు. ఆయన లీడర్ షిప్ వల్లే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోందన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభించేందుకు కృషి చేస్తామని చెప్పకనే చెప్పారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ సర్కార్ అప్పట్లో ఆ భూములను కేటాయించింది. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రాజెక్టు కాస్త వెనక్కి వెళ్లింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఆ ప్రాజెక్టు పనులు మొదలుకానున్నాయి.