కూటమి ఏడాది పాలనపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వైసీపీ పిలుపునివ్వడం ఆలస్యం వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారని నేతలు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. కూటమి మరో నాలుగేళ్లు కచ్చితంగా అధికారంలో ఉంటుంది. మరి ఈ నాలుగేళ్లూ ఇలాంటి నిరసనలు చేయడం వైసీపీకి సాధ్యమేనా..? పోనీ ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ పాల్గొన్నారా అంటే అదీ లేదు. ఆయన బెంగళూరులో, జనం ఏపీలో రోడ్లమీద.. ఇదెక్కడి లాజిక్. ఇలాంటి ప్లానింగ్ తో వైసీపీ ఇంకెన్నాళ్లు నిరసన రాజకీయాలు చేస్తుంది. నాలుగేళ్లపాటు జనంలో ఉండాలంటే కాస్త కష్టమే. అందులోనూ తమకు పాలన చేసే అవకాశం ఇవ్వకుండా ఈ రచ్చ ఏంటని కూటమి ప్రశ్నిస్తుంది కూడా. ఏడాదికే అద్భుతాలు జరిగిపోవాలంటే ఎలా అని తిరిగి జగన్ నే కార్నర్ చేస్తుంది. దీనికి వైసీపీ వద్ద సమాధానం ఉందా..?
రెండు నెలలకే మొదలు..
రెడ్ బుక్ విషయంలో కూడా వైసీపీ తొందరపడిందనే చెప్పాలి. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జగన్ ఢిల్లీలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని కోరారు. ఇప్పుడు కూడా అదే తొందర. ఏపీలో ప్రభుత్వ పథకాలేవీ అమలు కాలేదని అంటున్నారు వైసీపీ నేతలు. కూటమి హామీలు అమలవుతున్నాయా, లేదా అనేది ప్రజలకు బాగా తెలుసు. ఒకవేళ ఆ విషయంలో ప్రభుత్వం విఫలం అయితే, ఎన్నికల్లో ఏం చేయాలనేది కూడా వారికి బాగా తెలుసు. ఆ విషయంలో క్లారిటీతో ఉన్నారు కాబట్టే వైసీపీని సాగనంపి కూటమిని తెచ్చుకున్నారు. కూటమి కూడా నిజంగానే మోసాలకు పాల్పడితే జనం అంత అమాయకులేం కాదు. ప్రత్యామ్నాయం చూసుకుంటారు.
తప్పులు చేయనిస్తేనా కదా..
వైసీపీ డిమాండ్ల మేరకు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయి హామీలన్నీ అమలు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి..? హామీలు అమలైతే అది తమ గొప్పే అని వైసీపీ చెప్పుకోగలదా..? లేక కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే హామీలు అమలు చేసింది కాబట్టి వారికే తిరిగి ఓటు వేయాలని వైసీపీ నేతలు ప్రజలకు సందేశం ఇవ్వగలరా..? ఏడాదిలోనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీప నేతలు.. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసలు వైసీపీ ఎన్ని హామీలు అమలు చేయకుండా వదిలేసిందో చెప్పగలరా..?
మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, 45 ఏళ్లకే బలహీన వర్గాల వారికి పెన్షన్, సన్నబియ్యం పంపిణీ.. చెప్పుకుంటూ పోతే జగన్ నిలబెట్టుకోలేని హామీలు చాలానే ఉన్నాయి. మరి వీటికి వైసీపీ సమాధానం చెప్పుకోగలదా..? ఏడాది కూడా అవకాశం ఇవ్వకుండా హామీలు అమలు కాలేదంటూ రోడ్డెక్కడం మాత్రం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఇక నిరసన కార్యక్రమాలంటే మాటలు కాదు. జన సమీకరణ చేయాలి, అప్పుడే కాస్తో కూస్తో స్థానిక నాయకులకు ప్రయారిటీ ఉంటుంది. అధికారంలో ఉంటే ఇలాంటివి ఈజీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కార్యక్రమాలంటేనే లోకల్ లీడర్స్ ఖర్చుకు భయపడుతుంటారు. జగన్ సంగతేమో కానీ.. వైసీపీ లోకల్ నాయకులు మాత్రం ఈ కార్యక్రమాలకు జనాల్ని తరలించలేక ఇబ్బంది పడుతున్నారు.