Jagan: వైసీపీ అధినేత జగన్‌లో మార్పులు వస్తున్నాయా? ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఆలోచన తీరు మారిందా? దారుణంగా ఓడిపోవడంతో జరుగుతున్న పరిణామాలతో కంగారు పడుతున్నారా? గతంలో పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడు తమదైన శైలిలో స్పందించేవారు నేతలు. ఆ అంశంపై ఇప్పుడు స్వరం మారినట్టు కనిపిస్తోందా? పొత్తుల కోసం వెంపర్లాడుతోందా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
త్వరలో జమిలి ఎన్నికలంటూ కేడర్, నేతలను ఉత్సాహరిచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. జగన్‌తోపాటు కీలక నేతలంతా అదే రాగం వినిపిస్తున్నారు. జమిలి ఎన్నికలు ముందుగా రావన్న విషయం అందరికీ తెలుసు. పొత్తుల ప్రస్తావన వచ్చేసరికి సింహం సింగిల్‌గా వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పెద్ద డైలాగ్స్ చెప్పేవారు. ఇదంతా ఒకప్పటి మాట.
ఎందుకంటే 2014 పోటీ చేసిన ఫ్యాన్ పార్టీకి 60కి పైగానే సీట్లు దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలవడంతో కేవలం జగన్ చరిష్మా వల్లే సాధ్యమైందంటూ పెద్ద డాంబికాలు పలికేవారు. ఇక జగన్‌కు తిరుగులేదని, టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని భావించారు. బటన్ మనకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలంతా ఆశలు పెట్టుకున్నారు. చివరకు బటన్ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది.
సింహం సింగిల్‌గా వెళ్లి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ స్థాయికి పడిపోవడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు వైసీపీ నేతలకు తత్వం బోధపడింది. పార్టీల మద్దతు లేకుండా ఎన్నికల్లో సత్తా చాటడం కష్టమనే భావన ఆ పార్టీలో కనిపిస్తోంది. దీనికితోడు వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు బయటకు రావడంతో సింగిల్‌గా గెలవడం కష్టమని భావిస్తున్నారు నేతలు.
ALSO READ: అఖిలప్రియ- మౌనిక మధ్య చర్చలు.. ఏం జరిగింది?
ఈ క్రమంలో విశాఖలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన వైసీపీ టూ విజయసాయిరెడ్డి, పొత్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముందుగా వస్తున్నాయని వీఎస్ఆర్ చెప్పారు. ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తున్నారంటే నోరు మెదపలేకపోయారు. ఆ స్థాయి సమాధానం రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.
పొత్తుల మాట వచ్చేసరికి విధాన పరమైన నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందని సస్పెన్స్‌లో పెట్టారాయన. కేవలం కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు ఈ మాట అన్నారా? లేక నిజంగా పొత్తులకు సిద్ధమవుతున్నారా? అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైపోయింది.
ఒకప్పుడు సింహం సింగిల్‌గా వస్తుందనే చెప్పే నేతలు, ఈ విధంగా మాట్లాడడం వెనుక ఏం జరుగుతోందని అంటున్నారు. ఇంతకీ జగన్.. ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు? ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఉన్నాయి. ఇక మిగిలిన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన వైసీపీ ఆయా పార్టీలతో పొత్తుకు సిద్ధమవుతుందా? అనే చర్చ లేకపోలేదు. ఈసారి సింగిల్‌గా వెళ్లడం లేదన్నది ఆ పార్టీ మాట. ఇకపై సింహాన్ని ఇక సింగిల్‌గా చూడలేమన్నమాట.