తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉగాది వేడుకలు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పండగకీ సెట్టింగ్ వేసుకుని సెలబ్రేట్ చేసుకునే జగన్, అధికారం పోయిన తర్వాత ఇలాంటి వాటికి పూర్తిగా దూరమయ్యారు. సో ఆయన ఈ వేడుకలో లేరు, ఆయన పరోక్షంలో పనులన్నీ జరిపించే కింగ్ పిన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ వేడుకకు హాజరు కాకపోవడం విశేషం. ఇక ఈ వేడుకల్లో స్పెషల్ ఏమిటంటే, పంచాంగం. అవును. ఇది ఉగాది పంచాంగంలా లేదు, కేవలం వైసీపీ పంచాంగంలా ఉంది. జగన్ భవిష్యత్ ఏంటి..? పార్టీ పరిస్థితి ఏంటి..? అనే విషయాలపైనే ఫోకస్ పెట్టి పంచాంగం చదివి వినిపించారు. అయితే ఈ పంచాంగంపై ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు పడటం విశేషం.
ఉందిలే మంచికాలం..
వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో వైసీపీ స్పెషల్ పంచాంగం చదివి వినిపించారు అవధానులు. జగన్ కి దివ్యమైన భవిష్యత్ ఉందన్నారు. విజయాలన్నీ ఆయనవేనన్నారు. వచ్చేసారి జగన్ సీఎం సీటులో కూర్చోవడం గ్యారెంటీ అన్నారు. జగన్ మళ్లీ విజయ దుందుభి మోగిస్తారని చెప్పుకొచ్చారు. ఓటమి వస్తే ఎవరైనా భయపడి వెనకడుగు వేస్తారని, కానీ జగన్ అలా కాదని, గతంలో కూడా ఆయన ఓటమిని ఎదిరించి వచ్చారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు అవధానులు. జగన్ ది మిథున రాశి అని, ఆ రాశివారికి ఈ ఏడాది మంచి జరుగుతుందని, జగన్ కి మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ, ఈ ఏడాది కనీసం జగన్ కి ప్రతిపక్ష నేత హోదా అయినా వస్తుందా, అది చెప్పండి ముందు అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడటం విశేషం.
తప్పంతా ప్రజలదే..
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి కారణాలు విశ్లేషిస్తూ ఆ పార్టీ నేతలు రక రకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈవీఎంలపై నెపం నెట్టారు, ఆ తర్వాత ప్రజలదే తప్పని తీర్మానించారు. వైసీపీ ఆఫీస్ లో పంచాంగం చెప్పిన పంతులుగారు కూడా తప్పంతా ప్రజలదేనని చెప్పడం ఇక్కడ విశేషం. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆయన పంచాంగ శ్రవణంలో వినిపించారు.
రాయలుతో పోలిక..
సహజంగా జగన్ ని పులి, సింహంతో పోలుస్తుంటారు ఆ పార్టీ నేతలు. సింహం సింగిల్ గా వస్తుందని, ఆయన పులివెందుల పులి అని అంటుంటారు. వైసీపీ పంచాంగ కర్త మాత్రం ఈసారి ఆయన్ని కొత్తగా శ్రీ కృష్ణ దేవరాయలుతో పోల్చడం విశేషం. శ్రీకృష్ణ దేవరాయలు లాగా జగన్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. సాంఘికంగా ఆయన ఔన్నత్యాన్ని పొందుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి జగన్ కూర్చుంటారన్నారు.
వైసీపీ నేతలు ఈ స్థాయిలో జగన్ ని పొగిడారంటే ఓ అర్థం ఉంది. పంచాంగ శ్రవణం చేసేవారు కూడా ఈ రేంజ్ లో జగన్ ని పొగడటం ఇక్కడ విశేషం. జగన్ కచ్చితంగా మళ్లీ సీఎం అవుతారని ఆయన తీర్మానించేశారు. రాగా పోగా జగన్ కూడా ఇటీవల ఇలాంటి డైలాగులే చెబుతున్నారు. మూడేళ్లు కళ్లు మూసుకోండి, నాలుగేళ్లు కళ్లు మూసుకోండి మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు అందరికీ న్యాయం చేస్తానని అంటున్నారు. జగన్ మాటలే ఇప్పుడు పంచాంగ శ్రవణంలో కూడా వినిపించడం విశేషం.