Myanmar Earthquake: వరుస భూకంపాలు మయన్మార్‌ను గజగజ వణికిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం మరిచిపోక ముందే.. ఇవాళ మరోసారి భూమి కంపించింది. దాంతో జనం భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు అయింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు. మొన్నటి జరిగిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా కోలేకోలేదు. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలు తొలగించినా కొద్దీ డెడ్‌బాడీలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 16 వందలు దాటింది. వేలాది మంది గాయపడ్డారు.
ఈ భూమిపై ఉన్న ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి.. భూ ప్రకంపనలు, భూకంపాలు కొత్తేమీ కాదు. కానీ.. వాటి తీవ్రత ఎంత? దాని వల్ల జరిగే విధ్వంసం ఎంత? అనేదే మేజర్ పాయింట్. అప్పుడప్పుడు భూప్రకంపనలు సంభవిస్తున్నా.. అవేమంత నష్టం కలిగించే స్థాయిలో ఉండవు. కానీ.. మయన్మార్, థాయ్‌లాండ్ మాదిరిగా అరుదుగా వచ్చే భూకంపాలు.. ఊహించని నష్టాన్ని కలిగిస్తున్నాయి. అసలు అక్కడ గత రెండు రోజులుగా వరుస భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఆ రెండు దేశాల్లో.. ఇంతటి భారీ భూకంపం రావడానికి కారణాలేంటి?
ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఇంతటి భారీ భూకంపం ఎలా సంభవించిందని! అసలు.. భూమి లోపల ఏం జరుగుతోంది? తరచుగా భూప్రకంపనలు ఎందుకొస్తున్నాయి? అనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. అయితే.. మయన్మార్, థాయిలాండ్‌లో ఇంతటి భూరీ భూకంపాలు సంభవించడానికి, రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదవడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా ఈ రెండు దేశాలు భౌగోళికంగా.. టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులపై ఉండటం వల్ల కలిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ రెండు దేశాలు.. భారత్- ఆస్ట్రేలియా ప్లేట్, యురేషియన్ ప్లేట్‌ల సంగమ స్థానంలో ఉన్నయి. ఇవి తరచూ.. ఒకదానినొకటి ఢీకొనడం గానీ, ఒకదానిపై ఒకటి జారడం వల్ల గానీ.. ఈ స్థాయిలో భూకంపాలు సంభవిస్తాయని చెబుతున్నారు. టెక్టానిక్ ప్లేట్లు పక్కడి జరగడం వల్ల ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని భూగర్భ కదలికలే.. ఈ భూకంపాలకు మూల కారణంగా తెలుస్తోంది.
మయన్మార్‌లో సాగైంగ్ ఫాల్ట్ లాంటి పెద్ద ఫాల్ట్ లైన్లు ఉన్నాయి. ఇవి స్ట్రైక్-స్లిప్ రకం కదలికలు కారణమవుతాయి. ఈ ఫాల్ట్ లైన్ల వెంట ఒత్తిడి విడుదలైనప్పుడు.. భూకంపాలు సంభవిస్తాయి. ఇటు థాయిలాండ్‌లోనూ ఉత్తర భాగంలో చిన్న ఫాల్ట్ లైన్లు ఉన్నాయి. ఇవి.. మయన్మార్‌లోని భూకంపాల ప్రభావానికి లోనవుతాయి. ఇక.. మయన్మార్ సమీపంలోని అండమాన్-సుమత్రా సబ్‌డక్షన్ జోన్.. భారీ భూకంపాలకు కేంద్రంగా ఉంది. ఈ జోన్‌లో జరిగే టెక్టానిక్ కదలికలు.. ఈ ప్రాంతంలో భూకంప తీవ్రతను పెంచుతాయి.
ఈ మయన్మార్ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే పసిఫిక్ రింగ్‌లో భాగంగా లేదు. అయినప్పటికీ.. దానికి సమీపంలో ఉండటం వల్ల.. టెక్టానిక్ చర్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగానే.. మయన్మార్‌లో 7.7 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇది.. ఆ ప్రాంతంలోని టెక్టానికి అస్థిరత్వానికి సంకేతంగా కనిపిస్తోంది. ఈ కదలికలు సాధారణ ఒత్తిడికి గురికావడం, అకస్మాత్తుగా విడుదలవడం వల్ల జరిగి ఉండొచ్చని చెబుతున్నారు.
Also Read: అమెరికాలో వందలాది విదేశీ విద్యార్థుల జీవితాలు నాశనం..
వాస్తవానికి.. వరుస భూకంపాలు మయన్మార్‌ని గడగడలాడిస్తున్నాయి. ఈసారి.. దాని తీవ్రత ఎక్కువైంది. అందుకు తగ్గట్లుగానే విధ్వంసం, నష్టం భారీ స్థాయిలో ఉంది. ఈ భారీ భూకంపంతో.. అనేక పట్టణాలు వణికిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. చాలా ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మయన్మార్‌లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
ఈ భూకంపం మిగిల్చిన నష్టం నుంచి మయన్మార్, థాయ్‌లాండ్ ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య, నష్టం యెుక్క తీవ్రతని బట్టి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మయన్మార్‌లోని మాండలే వంటి ప్రాంతాల్లో చారిత్రక నిర్మాణాలు నేలమట్టమయ్యాయ్. 30 నుంచి 40 అంతస్తుల భారీ భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా.. రెండు దేశాల్లో మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ భూకంపాలతో.. ప్రజల్లో భయాందోళనలు వ్యాపించాయి. అంతా.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.