YS Jagan Tweet: జగన్ స్పందించారు. ఎట్టకేలకు తన మాట వినిపించారు. అరెస్ట్ ల సమయంలో ఆచితూచి స్పందించే మాజీ సీఎం జగన్.. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త సీరియస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ స్పందించడం ఏమో కానీ, ఆ రోజు ఏమైంది అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేయడం విశేషం. ఇంతకు జగన్ స్పందించింది ఏ విషయంపై? అసలేం జరిగిందో తెలుసుకుందాం.
అమరావతి రాజధాని లక్ష్యంగా కొందరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ సాగిన విషయం తెలిసిందే. వైశ్యల రాజధాని అంటూ ఓ మీడియా ఛానెల్ లో నిర్వహించిన చర్చా వేదికలో చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనితో ఈ కామెంట్స్ పై ఇప్పుడు కేసు నమోదు కాగా, తాజాగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారంపై ఇప్పుడు మాజీ సీఎం జగన్ సీరియస్ కామెంట్స్ చేయడం విశేషం.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ స్పందిస్తూ.. ఏపీ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని, ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు.
ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారన్నారు. చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని జగన్ విమర్శించారు.
సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? అంటూ జగన్ ట్వీట్ చేయడం విశేషం.
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, సీఎం చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారన్నారు. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయిందన్నారు.
Also Read: AP Tourism Spots: ఏపీలో కులుమనాలి ఉందని తెలుసా? ఇక్కడ ఆ ఒక్కటి తప్పక చూడాల్సిందే!
నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండంటూ హెచ్చరించారు. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండని జగన్ అన్నారు.
ఇదే విషయంపై నెటిజన్స్ కూడా జగన్ కు భారీ షాకులు ఇస్తున్నారు. మీ పాలనలో సాగిన విధానాన్ని ఇప్పుడు కూటమి అవలంబిస్తోందని, నాడు టిడిపి నేతల అరెస్ట్ సమయంలో జగన్ ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.