AP Tourism Spots: విశాఖపట్నం జిల్లా పాడేరు సమీపంలో ఉన్న వంజంగి వ్యూ పాయింట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజంలో హాట్ స్పాట్ గా మారింది. తెల్లవారుజామున కొండపైకి వెళ్లి అక్కడ కనిపించే మేఘాల సముద్రం చూసిన వాళ్లెవ్వరైనా ఒక్కసారి ఖచ్చితంగా ముగ్ధులవుతారు. కొండలపై నిలబడి మేఘాలను కింద చూడడం అంటే ఒక మాయాజాలం లాంటిది. అందుకే దీనిని చాలామంది ఏపీ కులుమనాలి అని కూడా పిలుస్తారు. అచ్చం హిమాచల్‌లో ఉన్న ఫీలింగ్ ఇస్తూ, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఈ అద్భుత సందర్శనానికి మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..
వంజంగి ఎక్కడ ఉంది?
వంజంగి వ్యూ పాయింట్ విశాఖ జిల్లా పాడేరు మండలంలో ఉంది. అరకు వ్యాలీ నుంచి ఇది సుమారు 12 కి.మీ దూరం. విశాఖ నుంచి అరకు వరకు రోడ్ మార్గంలో ప్రయాణించి, అక్కడినుంచి వంజంగి వరకు కారు లేదా బైక్ తీసుకుని వెళ్లొచ్చు. కొండపైకి వెళ్లే మార్గం మాత్రం ట్రెక్కింగ్ చేయాల్సిందే. దాదాపు అరగంటల పాటు పాదయాత్ర చేయాలి. ఈ పాదయాత్రలో అడవిలో పచ్చని చెట్లు, చిన్న వాగులు, పచ్చని నేలతో కూడిన మార్గం మనసుని తాకుతుంది.
తెల్లవారుజామున కనిపించే అద్భుతం
ఇక్కడ అసలు ప్రత్యేకత తెల్లవారుజామున కనిపించే దృశ్యం. సుమారు 4:30 నుండి 6:00 మధ్య కొండపైకి చేరుకుంటే కింద మబ్బులు మనల్ని తాకినట్లు కనిపిస్తాయి. మేఘాల సముద్రం మధ్య నుంచి సూర్యుడు తలెత్తుతూ కనిపించే దృశ్యం జీవితంలో మరచిపోలేనిది. కొన్నిసార్లు సూర్యకిరణాలు మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చే విధానం మనకు నచ్చిన సినిమా సన్నివేశం చూసిన ఫీలింగ్ ఇస్తుంది.
వాతావరణం ఎలా ఉంటుంది?
వంజంగి వ్యూ పాయింట్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవిలో కూడా 15–20 డిగ్రీల మధ్యే ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షాకాలంలో పొగమంచు, మబ్బులు ఎక్కువగా కనిపిస్తాయి. శీతాకాలం అయితే అసలే ఇది డ్రీమ్ డెస్టినేషన్‌గా మారుతుంది. కానీ వర్షాకాలంలో వెళ్లాలంటే కొంచెం జాగ్రత్త అవసరం తప్పనిసరి. అయితే ఈ మార్గాలు జారే అవకాశం ఉంటుంది.
సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్
ఇక్కడకు వెళ్లే యువతీ యువకులు ఎక్కువగా సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీయడానికే వస్తుంటారు. ట్రావెల్ వ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇది మినీ హిల్స్ ట్రిప్ లాంటి అనుభూతిని ఇస్తుంది. మేఘాల మధ్య ఫొటోలు తీసుకుంటే వాటిని ఎడిట్ చేయాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే ఇదొక మాయాజాలంగా ఉంటాయి.
Also Read: IMD Alerts: 6 రోజులు భారీ వర్షాల దాడి! దక్షిణ రాష్ట్రాల్లో అలర్ట్.. బయటికి వెళ్ళకండి!
వంజంగి విశేషాలు.. ఓసారి చూసేయాల్సిందే
ఇది సముద్రమట్టానికి సుమారు 3,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2020 లో కొందరు ట్రెక్కర్స్ అక్కడ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపులర్ అయింది. ఇప్పటివరకు ఇది పర్యాటక శాఖ అధికారికంగా అభివృద్ధి చేయలేదు. అందుకే ఇక్కడి ప్రకృతి స్వచ్ఛంగా, అసలైన రమణీయతను చూపిస్తోంది.
ఇక్కడ మొబైల్ నెట్‌వర్క్ లేదు. దీంతో డిజిటల్ డిటాక్స్ అనిపిస్తుంది. కొండపై వసతి సదుపాయాలు లేకపోవడంతో స్థానికులు గైడ్‌లా సహాయపడతారు. కావాలంటే వాళ్లతో ముందుగానే సంప్రదించి ఏర్పాట్లు చేసుకోవాలి. తినుబండారాలు, మంచినీరు తీసుకెళ్లడం మంచిది.. అక్కడ దొరకడం కష్టమే.
ఎప్పుడెప్పుడు వెళ్లాలి?
అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలం వంజంగికి వెళ్లడానికి బెస్ట్ సీజన్. ఈ సమయంలో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వానల కాలంలో కొండ మార్గాలు జారిపోవచ్చు. చుట్టూ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ, సన్నగా వీచే గాలిలో నెమ్మదిగా పాదయాత్ర చేస్తూ ఈ అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఇప్పటిదాకా మీరు అరకు వెళ్లి కూడా వంజంగి వ్యూ పాయింట్ చూడకపోతే.. ఓ అద్భుతాన్ని మిస్సయినట్టే. స్నేహితులతో, ఫ్యామిలీతో తెల్లవారుజామున అక్కడకు చేరితే, మీ జీవితంలో మరపురాని క్షణాలను వెదజల్లే ఈ పర్వత అంచు.. జీవితాంతం గుర్తుండిపోతుంది.