
Jagan : ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ దూకుడును మరింత పెంచారు. తాజాగా అనంతపురం జిల్లా నార్పల బహిరంగ సభలో పాల్గొన్న సీఎం.. జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.912.71 కోట్ల నగదును 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ వేదికపై నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. ఒక ముసలాయన జాతీయ మీడియాకు వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చారని బాబుపై సెటైర్లు వేశారు. ఆయన మాటలు వినేప్పుడు.. పంచతంత్రంలోని ఓ కథ గుర్తొంచిందని తెలిపారు.
“అనగనగా ఓ పులి ఉండేది. నరమాంసం తినేది. కొన్నాళ్లకు ముసలిదైపోయింది.వేటాడే శక్తి, పరుగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. 4 నక్కలను తోడేసుకుంది. మనుషులను ఎలా తినాలనే ప్లాన్ వేసుకుంది. ఓ మడుగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగలను ఆశ చూపించేది. తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి అంటూ ఊరించేది. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లు మడుగులోకి వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదలో వారు ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది. ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, మాయమాటలు చెప్పేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని. ఈ కథ వింటే అబద్ధాలు చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు”అని జగన్ సెటైర్లు వేశారు.
వేటాడే శక్తి కోల్పోయిన పులి.. గుంట నక్కలను వెంటేసుకుని తిరిగినట్లుగా చంద్రబాబు తీరు ఉందని జగన్ విమర్శించారు. ఇలాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదని ప్రజలకు సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారని విమర్శించారు.
దోచుకో, పంచుకో..తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతమని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉందని .. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు ఉన్నారని మండిపడ్డారు. బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండని ప్రజలకు సూచించారు. జగన్ వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది ఆలోచండి అని అన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల దీవెనలు తనకు కావాలి అని జగన్ కోరారు.