మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వార్ స్టార్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆయన వరుసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టడం కంటే, తన ప్రెస్ మీట్ సారాంశాన్ని ట్విట్టర్లో పెట్టడమే బెటర్ అనుకుంటున్నారు జగన్. ఇటీవల పదో తరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, తాజాగా రేషన్ పంపిణీ విషయంపై మరో సుదీర్ఘ ట్వీట్ వేశారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబుగారూ..! అంటూ తనదైన శైలిలో వెటకారం కూడా మొదలు పెట్టారు జగన్.
ఎందుకీ కక్ష..?
రేషన్ పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఇంటి వద్దకే రేషన్ పద్ధతి అమలులో ఉంది. రేషన్ వాహనాల ద్వారా సరకులు పంపిణీ చేసేవారు. దాన్ని నిలిపివేసి తిరిగి రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. దీన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? అంటూ జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారని అడిగారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలని, కానీ వారిని కష్టపెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
1.@ncbn గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? మరోవైపు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 1, 2025
వారి సంగతేంటి..?
ఇంటివద్దకే రేషన్ పద్ధతిని ఆపివేయడం వల్ల.. 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకులు ఉపాధి కోల్పోయారనిచెప్పారు జగన్. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని అడిగారు. వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా ఈ వాహనాల ద్వారా సేవలు అందాయని.. అలాంటిది ఇప్పుడీ వాహనాలను తొలగించడం సబబేనా అని అన్నారు జగన్. దేశమంతా కొనియాడిన రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ ని రద్దు చేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు.
రేషన్ డోర్ డెలివరీ వాహనాలు నిలిపివేయడం ద్వారా వాటిపై ఆధారపడిన ఉద్యోగులు రోడ్డున పడ్డారని, అదే సమయంలో వాలంటీర్లపై కూడా కత్తిగట్టి వారి ఉద్యోగాలు కూడా తొలగించారన్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే చేశారన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవార్డు సచివాలయాలపై చంద్రబాబు కక్ష కట్టి, 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధికట్టారన్నారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు.. ఇలా అన్నింటినీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు జగన్.
ఉద్యోగాలు తీసేశారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల తొలగింపు గరిష్టంగా ఉందన్నారు జగన్. రేషన్ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులను ఒకే దెబ్బతో తొలగించారని, కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదని చెప్పారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్‌ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షలమంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబుగారూ..! అంటూ ముక్తాయించారు జగన్.
కూటమి ప్రభుత్వంపై విమర్శల విషయంలో జగన్ దూకుడు పెంచారు. ఇన్నాళ్లూ రెడ్ బుక్ అంటూ కేవలం ఒకే ఒక్క పాయింట్ కి ఫిక్స్ అయిన ఆయన.. ఇప్పుడు విషయాల వారీగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను టీడీపీ కొట్టిపారేస్తోంది. జగన్ హయాంలో రేషన్ వాహనాల పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని, దాన్ని సరిచేస్తున్నామని నేతలు సమాధానమిస్తున్నారు.