వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తుల గొడవ తెలిసిందే. ప్రధానంగా సరస్వతి పవర్ అనే కంపెనీ విషయంలో ఈ గొడవ వచ్చింది. అది చినికి చినికి గాలివానలా మారి అన్న, చెల్లి చెరోదారిగా మారారు. చివరకు రాజకీయంగా కూడా ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ఈ క్రమంలో సరస్వతి పవర్ కంపెనీ వాటాల వివాదాలపై హైదరాబాద్ లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈనెల 30న లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. అయితే ట్రైబ్యునల్ బెంచ్ లో ఒక సభ్యుడు సెలవులో ఉండడంతో తీర్పును రిజర్వు చేయలేదు. తదుపరి విచారణను జూలై 11కి ట్రైబ్యునల్ వాయిదావేసింది.
జగన్ వాదన ఏంటి..?
సరస్వతి పవర్ అనే కంపెనీ తన తండ్రి సంపాదించిన ఆస్తి కాదని, అది తన స్వార్జితం అని, అందువల్ల దానిపై సంపూర్ణ హక్కులు తనకే ఉన్నాయని జగన్ తన వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించారు. అయితే గతంలో తన చెల్లిపై ఉన్న ప్రేమానురాగాల వల్ల ఆమెకు 51శాతం వాటాను ఇద్దామనుకున్న మాట వాస్తవమే అని, కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తనకు, తన చెల్లికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే వాటాలు ఇవ్వలేదని జగన్ తెలిపారు. ఎంఓయూ, గిఫ్ట్ డీడ్ కూడా రద్దు చేసుకున్నట్టు స్పష్టం చేశారు. తాను ఆమెకు షేర్ల బదిలీ అనే బహుమతిని మౌఖికంగా ఇవ్వలేదని, అందువల్ల ఆ వాటాల బదిలీ చెల్లుబాటు కాదని అంటున్నారు జగన్. తప్పుడు పత్రాలు సృష్టించి తన చెల్లి, తల్లి తనను మోసం చేశారని కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కంపెనీ పూర్తిగా తనదేనని చెప్పారు జగన్.
విజయమ్మ ఏమంటున్నారు..?
సరస్వతి పవర్ కంపెనీలో నిబంధనల ప్రకారమే షేర్ల బదిలీ జరిగిందని అంటున్నారు జగన్ తల్లి విజయమ్మ. చెల్లిపై జగన్ కు ప్రేమ తగ్గి ఉండొచ్చు కానీ, తల్లిగా తనపై ఆయనకు ప్రేమ తగ్గినట్టు చెప్పలేదు కదా అని లాజిక్ తీశారామె. ఆ కంపెనీలో 99.89 శాతం వాటా తన వద్దే ఉందని చెప్పుకొచ్చారు. నూటికి నూరుశాతం ఆ కంపెనీ తనదేనంటూ పిటిషన్లో పేర్కొన్నారు విజయమ్మ. కుటుంబ వ్యవహారాన్ని అనవసరంగా కోర్టుకు లాగారని చెప్పారు. ఇది కంపెనీ లా ట్రైబ్యునల్ తేల్చాల్సిన వ్యవహారం కాదని, సివిల్ కోర్టు అని స్పష్టం చేసారు. నిబంధనల ప్రకారమే తన పేరుపై షేర్ల బదిలీ జరిగిందని స్పష్టం చేశారు విజయమ్మ. సరస్వతి పవర్ కంపెనీని తనకు గిఫ్ట్ డీడ్ చేశారని, ఎంవోయూ తర్వాత జగన్ సరస్వతి పవర్ బోర్డుకు రాజీనామా చేశారని కూడా గుర్తు చేశారు. ఆ కంపెనీలో వాటాలు వదులుకున్న తర్వాత దానికి సంబంధించిన అంశాలతో జగన్ కి సంబంధం లేదన్నారు. సరస్వతి పవర్ కంపెనీ తనదని, దాని అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి జగన్ ఎవరని అడిగారు.
షర్మిల వాదన ఏంటి..?
సరస్వతి పవర్ లో షర్మిలకు వాటా లేదని అంటారు జగన్. విజయలక్ష్మి ఆ కంపెనీ మొత్తం తనదేనంటారు. ఇక షర్మిల కూడా ఈ వ్యవహారంపై ట్రైబ్యునల్ కి ఓ అభ్యర్థన పంపించారు. సరస్వతి పవర్ కంపెనీలో తనకెలాంటి వాటా లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని, తనను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ట్రైబ్యునల్‌ను షర్మిల అభ్యర్థించడం విశేషం.
వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల్లో భాగంగా సరస్వతి పవర్ కంపెనీని చెల్లెలు షర్మిలకు ఇద్దామనుకున్నారు జగన్. ఆల్రడీ ఇచ్చేశారని కూడా అంటారు. అయితే ఆమె కుటుంబానికి దూరం జరగడం, సొంత పార్టీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి జగన్ నే విమర్శించడంతో గొడవలు మొదలయ్యాయి. వాటాలు ఇచ్చేది లేదని, ఆ కంపెనీ తనదేనని ప్లేటు ఫిరాయించారు జగన్. దీంతో వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వరకు వెళ్లింది. తుది తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి.